బైడెన్.. క్లింటన్.. ఒబామా 'మౌనం' అమెరికాలో అల్‌ఖైదా ఉగ్ర సంస్థ భీకర దాడులకు 20ఏళ్లు (9/11 anniversary) నిండిన నేపథ్యంలో.. సెప్టెంబర్ 11 మెమోరియల్ వద్ద అమెరికా దేశ ముగ్గురు అధ్యక్షులు నివాళులు అర్పించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సహా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్విన్ టవర్స్ కూలిపోయిన ప్రాంతంలో మౌనం పాటించారు. ఘటనలో మరణించినవారికి సంతాపంగా బ్లూ రిబ్బన్ ధరించి ఐకమత్యాన్ని చాటారు.
మౌనం పాటిస్తున్న మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షుడు 9/11 దాడులు (9/11 attack) జరిగినప్పుడు బైడెన్ సెనేటర్‌గా ఉన్నారు. న్యూయార్క్‌తో పాటు ఉగ్రదాడి జరిగిన మూడు ప్రాంతాలను బైడెన్ సందర్శిస్తారని అధికారులు తెలిపారు. పెన్సిల్వేనియాను సందర్శించి చివరగా పెంటగాన్‌కు వెళ్తారని వెల్లడించారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు జెట్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి.
షాంక్విల్లో బుష్, కమల ప్రసంగం...
ధైర్యమనేది.. ఊహించిన దానికంటే సాధారణ విషయమని.. మృత్యువు ఎదురైన వెంటనే బయటపడుతుందని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ వెల్లడించారు. షాంక్విల్లో మాట్లాడిన ఆయన.. ఫ్లైట్ 93 విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ధైర్యసాహసాలను కొనియాడారు. వీరంతా అమెరికన్లందరి కోసం నిలబడ్డారని అన్నారు. 'ఫ్లైట్ 93లోని 33 మంది ప్యాసింజర్లు, ఏడుగురు సిబ్బందిని విధి ఎంపిక చేసింది. వీరంతా మన కోసం నిలబడ్డారు. ఈ బృందం... అత్యద్భుతమైన సమూహమని ఉగ్రవాదులు తర్వాత తెలుసుకున్నారు,' అని పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమంలో ప్రసంగించిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. 9/11 దాడుల్లో మరణించినవారికి సంఘీభావం తెలిపారు. 'మన దేశంలోని చాలా మంది ఈ 20 ఏళ్ల సమయాన్ని కఠినంగా గడిపారు. మీకు అండగా మేమున్నాం. దేశం మొత్తం మీ వెంటే ఉందని గుర్తుపెట్టుకోండి,' అని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో భవిష్యత్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:9/11 attacks: 20ఏళ్ల పాటు అమెరికా పోరాటం.. ఫలితమేంటి?