అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తయ్యింది. కేబినెట్‌లో కొందరి పేర్లను బైడెన్ తాజాగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమెరికా భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించారు.
అమెరికా మాజీ కార్యదర్శి, సీనియర్ సెనెటర్ జాన్ కెర్రీ జాతీయ భద్రతా మండలిలో వాతావరణ రాయబారిగా నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో-బైడెన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం నిర్మాతల్లో ఒకరైన జాన్ కెర్రీకి... వాతావరణ మార్పులపై పోరాటానికి మరోసారి సారథ్యం వహించే అవకాశం దక్కినట్లు సమాచారం.
వాతావరణ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించిన అమెరికా జాతీయ భద్రతా మండలిలో తొలి సభ్యుడిగా జాన్ కెర్రీ నియమితులయ్యారు. వాతావరణానికి హానీ కలిగించే కర్బన ఉద్గారాల నియంత్రణకు గత ప్రభుత్వం కంటే కఠినంగా, విస్తృతంగా పోరాటం చేయనున్నట్లు ఎన్నికల్లో బైడెన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు జాన్ కెర్రీని నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియమకాన్ని జాన్ కెర్రీ ధ్రువీకరించారు.
త్వరలో ఏర్పడనున్న అమెరికా కొత్త ప్రభుత్వం వాతావరణ సంక్షోభాన్ని అత్యవసర జాతీయ ముప్పుగా భావిస్తోందని కెర్రీ ట్వీట్ చేశారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు, తమ మిత్రులు, యువ వాతావరణ ఉద్యమకారులతో భాగస్వామ్యం కావటంతో గర్వంగా ఉందన్నారు.