తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కట్టడికి బైడెన్​ 100 రోజుల మాస్క్​ ఛాలెంజ్ - america latest news

విదేశాల నుంచి అమెరికాకు వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ పరీక్ష చేయించుకొని విమానం ఎక్కాల్సిందేనని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. విమానం దిగిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్​ పాటించాలని స్ఫష్టం చేశారు. కొవిడ్‌-19పై పోరుకు జాతీయ ప్రణాళికను జారీ చేశారు. కేసులు ఇలానే పెరిగిపోతూ ఉంటే వచ్చే నెలలో మృతుల సంఖ్య 5 లక్షలు దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ మహమ్మారిపై తప్పనిసరిగా విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Biden launches '100 days mask challenge'. makes COVID-19 test, quarantine mandatory for people entering US
కరోనా కట్టడికి బైడెన్​ 100 రోజుల మాస్క్​ ఛాలెంజ్

By

Published : Jan 22, 2021, 8:41 AM IST

Updated : Jan 22, 2021, 11:00 AM IST

అగ్రరాజ్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే బైడెన్‌ కరోనా మహమ్మారి అంతానికి తన వ్యూహాలేంటో ఆవిష్కరించారు. పెను సవాలుగా మారిన కరోనా నియంత్రణపైనే ఆయన తన తొలి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలంతా వంద రోజులపాటు మాస్కులు ధరించాలనీ ఆదేశించారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లేవారికి క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు. ఇలా పలు నిబంధనలతో మహమ్మారిని రూపుమాపడానికి బైడెన్ పటిష్ఠ ప్రణాళికను రూపొందించారు.

ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలను సందర్శించేవారూ.. ప్రయాణ సాధనాలను వినియోగించుకునేవారూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని బైడెన్‌ పేర్కొన్నారు. అలాగే దేశంలో కరోనా స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యక్షునికి తెలియజేసేలా కొవిడ్‌-19 రెస్పాన్స్‌ కో-ఆర్డినేటర్‌ను అధికారికంగా నియమించారు. వైద్య పరికరాలు, మాస్కులు, రక్షణ దుస్తులు, సిరంజీలు, సూదులు.. ఇలా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో ఆయుధాలుగా ఉపయోగపడే ఏ వస్తువునైనా అత్యవసర ప్రాతిపదికన ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 'డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌'పైన సంతకం చేశారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అమెరికాలో నాలుగు లక్షల మంది చనిపోయారని.. రెండో ప్రపంచ యుద్ధం కంటే ఇది ఎక్కువని ఆయన గుర్తుచేశారు. అందుకే 'యుద్ధప్రాతిపదికన' అన్న తన మాటల్ని పరిగణనలోకి తీసుకొని పనిచేయాలని సూచించారు.

5లక్షల మంది చనిపోవచ్చు..

వచ్చే నెల ఆరంభానికి మృతుల సంఖ్య ఐదు లక్షలు దాటే అవకాశం ఉందని.. అలాగే కేసులు సైతం భారీగా పెరగనున్నాయని బైడెన్ గుర్తుచేశారు. ఈ పరిస్థితి ఒక్కరోజులో తలెత్తింది కాదని.. కోలుకోవడానికి ఇంకా కొన్ని నెలలు పట్టొచ్చని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా మహమ్మారి నుంచి బయటపడతామని మాత్రం హామీ ఇచ్చారు. అందుకోసం ప్రచారం సమయంలోనే తన ప్రణాళికలేంటో వివరించానని.. గత మూడు నెలల కాలంలో వాటికి మరింత పదును పెట్టినట్లు వెల్లడించారు. తమ ప్రతి చర్య శాస్త్రవిజ్ఞానం ఆధారంగానే తీసుకుంటున్నామని.. ఎక్కడా రాజకీయాలకు తావివ్వడం లేదని తెలిపారు.

వీలైనంత ఎక్కువ మందికి..

వీలైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు కృషి చేస్తున్నామని బైడెన్‌ తెలిపారు. రాబోయే 100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీన్ని సాకారం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల రోజుల్లో మరో 100 కొవిడ్‌ టీకా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని 'ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఈఎంఏ)'కి సూచించారు. అలాగే కావాల్సినన్ని డోసులు అందుబాటులో ఉంచేందుకు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) ‘ఫెడరల్‌ ఫార్మసీ ప్రోగ్రాం’ను ప్రారంభించనుందని తెలిపారు. టీకా అందించే సిబ్బంది కొరత ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు తగినంత మందికి శిక్షణనిచ్చి సిద్ధంగా ఉంచాలని ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌’ను ఆదేశించినట్లు తెలిపారు.

మహమ్మారి కారణంగా విద్యార్థి రుణాలు, వాటిపై వడ్డీల చెల్లింపుల గడువును పొడిగించాలని విద్యా విభాగాన్ని బైడెన్‌ ఆదేశించినట్టు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సకి వెల్లడించారు. అలాగే మహమ్మారిపై పోరులో తనతో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ఇతర పాలకవర్గం పారదర్శకంగా వ్యవహరిస్తుందని బైడెన్‌ హామీ ఇచ్చారు. మహమ్మారికి సంబంధించి.. మంచైనా.. చెడైనా.. ప్రజలకు నిష్పక్షపాతంగా తెలియజేస్తామన్నారు.

ఇదీ చూడండి: 'భారత్​, అమెరికా బంధం.. 'కమల'తో మరింత దృఢం'

Last Updated : Jan 22, 2021, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details