అగ్రరాజ్య తదుపరి అధినేత ఎవరన్నదానిపై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతోంది! డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి చేరువవుతున్నారు. తాజాగా జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఆయన ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. నెవాడాలో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్కటి దక్కినా.. అధ్యక్ష పదవి ఆయన సొంతమవుతుంది.
మళ్లీ ఓట్ల లెక్కింపు అనివార్యం..
దీంతో ట్రంప్ పదవిలో కొనసాగే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి! మరోవైపు- జార్జియాలో అభ్యర్థులిద్దరి మధ్య అంతరం స్వల్పంగా ఉండటం కారణంగా ఓట్లను మళ్లీ లెక్కించడం అనివార్యమని అధికారులు చెబుతున్నారు. పెన్సిల్వేనియాలోనూ రీకౌంటింగ్ కోరుతూ కోర్టును ఆశ్రయించాలని ట్రంప్ బృందం యోచిస్తోంది. విజయానికి చేరువైన నేపథ్యంలో బైడెన్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం భద్రతను పెంచింది.
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవేళ అమెరికాలో ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఆ ఐదింటినీ చేజిక్కించుకుంటేనే ట్రంప్‌కు అధ్యక్ష పీఠం దక్కుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది! గురువారం వరకూ ఆయన ముందంజలో ఉన్న జార్జియా, పెన్సిల్వేనియాల్లో తాజాగా బైడెన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లడమే ఇందుకు కారణం. పోలింగ్ రోజు నమోదైన సాధారణ ఓట్ల లెక్కింపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పోలింగ్ రోజుకు ముందే గణనీయ సంఖ్యలో డెమొక్రాట్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు అంచనా వేశాయి. తాజా ఫలితాల సరళిని చూస్తే అది వాస్తవమేనని తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సాగే కొద్దీ జార్జియా, పెన్సిల్వేనియాల్లో ట్రంప్ వెనకబడటమే ఇందుకు నిదర్శనం. ఫలితం ఇంకా తేలాల్సి ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే..
జార్జియా.. పరిస్థితి తారుమారు
దాదాపు 98 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. గురువారం వరకూ ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, శుక్రవారం పరిస్థితి తారుమారైంది. బైడెన్ స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఇద్దరి మధ్య అంతరం రెండు వేల ఓట్ల లోపే ఉంది. విదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు పంపిన ఓట్లు, స్థానికంగా వచ్చిన మరికొన్ని పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. అభ్యర్థుల మధ్య అంతరం చాలా స్వల్పంగా ఉండటం వల్ల రాష్ట్రంలో రీకౌంటింగ్ తప్పదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 16.
పెన్సిల్వేనియా