అఫ్గానిస్థాన్(Afghanistan latest news) నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మరోసారి సమర్థించుకున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ లక్షా 20 వేల మందిని అఫ్గాన్ నుంచి తరలించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జాతని ఉద్దేశించి ప్రసంగించారు. అయినప్పటికీ వందకుపైగా అమెరికన్లతోపాటు వేలమంది అఫ్గాన్‌వాసులు అక్కడే ఉన్నట్లు తెలిపారు. అఫ్గాన్ నుంచి విదేశాలకు వెళ్లేవారిని తాలిబన్లు(Afghanistan Taliban) అడ్డుకోకుండా అంతర్జాతీయ భాగస్వాములతో సమన్వయం చేసుకోవాలని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు సూచించారు.
"అమెరికా 20ఏళ్ల యుద్ధానికి అమెరికా ముగింపు పలికింది. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా 1,20,000 మందిని అఫ్గానిస్థాన్ నుంచి తరలించాం. ఇది అమెరికాకు మాత్రమే సాధ్యం. అది మేము చేసి చూపించాం. మిలిటరీ తరలింపు ఓ అద్భుత విజయం. ఈ మిషన్ విజయానికి కారణం అమెరికా మిలిటరీ విభాగం. వారి నైపుణ్యాలు, వీరత్వానికి ఈ విజయం నిదర్శనం."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు