అమెరికాలో ఎప్రిల్ నెలలో.. కొత్తగా పదిలక్షల ఉద్యోగాలు వస్తాయని అక్కడి ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేసిన వేళ.. కొత్త ఉద్యోగాలు కేవలం 2 లక్షల 66 వేలకు మాత్రమే పరిమితం అయినట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది. అదే సమయంలో నిరుద్యోగ రేటు 6.0 నుంచి 6.1శాతానికి పెరిగినట్లు పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా గతేడాది ఆగస్టు నుంచి ఎక్కువమంది పని చేయడానికి మొగ్గు చూపడంలేదని అమెరికా కార్మిక కార్యదర్శి మార్టి వాల్ష్ తెలిపారు. కొవిడ్ విజృంభణకు ముందున్న 80 లక్షల ఉద్యోగాలను తిరిగి పొందాలంటే మరింత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో నిరుద్యోగం పెరగడం కారణంగా రాజకీయ, వ్యాపార వర్గాల నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీనిపై బైడెన్ స్పందించారు. కరోనా నుంచి కోలుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ప్రణాళిక ప్రకారం సరైన దిశలో పయనిస్తోందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే 15లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన మూడు నెలల్లోనే ఇంత పెద్దమొత్తంలో ఉద్యోగాలు కల్పించడం గతంలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. అయితే.. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వందశాతం టీకా పంపిణీ చేయడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం అనేవి తమ తక్షణ కర్తవ్యాలుగా ఉన్నాయని బైడెన్ వివరించారు.