అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్, కమలా హారిస్ విజయం దాదాపు ఖరారైంది. వారు ఇంకా 6 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంటారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఆపితే మాత్రం ట్రంప్‌కు విజయావకాశాలు ఉంటాయి. అందుకే కోర్టును సంప్రందించి కౌంటింగ్‌ను అపేలా చేయగలిగే ఓ శక్తిమంతమైన న్యాయవాది కోసం ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ తీవ్రంగా అన్వేషిస్తున్నారు. 2000 సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఫ్లోరిడాలో రీకౌంటింగ్‌ను ఆపి, జార్జి డబ్ల్యూ బుష్ గెలిచేలా చేసిన జేమ్స్ బేకర్ వంటి లాయర్‌ను కనిపెట్టే పనిలో పడ్డారు. కుష్నర్ బుధవారం మొత్తం ఇదే పనిలో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.
అమెరికా మీడియా లెక్కల ప్రకారం ప్రస్తుతం బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మ్యాజిక్ ఫిగర్‌కు 6 ఓట్ల దూరంలో ఉన్నారు. ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లే గెలిచారు. అయితే జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ఆయన ముందంజలో ఉన్నారు.