అత్యంత ప్రజాదరణ కలిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతుగా ఒబామా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రచార కమిటీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 21న ఫిలడేల్ఫియా, పెన్సిల్వేనియాలో జరిగే ప్రచారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒబామాకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. మంచి వక్తగా పేరుంది. అందుకే ట్రంప్‌నకు దీటుగా ఆయనను ప్రచారంలోకి దింపాలని పార్టీ భావించింది. మరోవైపు ఒబామా ప్రచారంపై ట్రంప్ విమర్శలు చేశారు. ప్రజలపై ఆయన అంతగా ప్రభావం చూపలేరని వ్యాఖ్యానించారు. అందుకే 2016లో ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు.
ట్రంప్ విభజించి.. సంతోషిస్తారు..
మరోవైపు ఓటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.
"ట్రంప్ ప్రజల్లో విభజన తెచ్చేందుకు ఎంతదూరమైనా వెళతారు. విద్వేషాలు రెచ్చగొట్టి సంతోషిస్తారు. కరోనా వైరస్ విషయంలో ట్రంప్ ఇంకా కలల ప్రపంచంలోనే జీవిస్తున్నారు. ఏదో అద్భుతం జరిగి వైరస్ కనిపించకుండా పోతుందని కలలుగంటున్నారు."