పోలీసుల క్రూరత్వం, జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రను తుడిచేయడానికి నిరసనకారులు ప్రయత్నించారని ఆరోపించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
స్వాతంత్ర్య వేడుకలకు ముందు మౌంట్ రష్మోర్ జాతీయ స్మారకం వద్ద జాతినుద్దేశించి ప్రసంగించారు ట్రంప్. కొంతమంది నిరసనకారులు అమెరికా గొప్ప నేతల విగ్రహాలను ధ్వంసం చేయటానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇందులో బానిసత్వ విముక్తి కోసం పోరాడిన వాళ్లూ ఉన్నారన్నారు.
"ఈ ఉద్యమం రష్మోర్ పర్వతంపై ఉన్న ప్రతి ఒక్కరి వారసత్వాలపై బహిరంగంగా దాడి చేసింది. మన జాతీయ హీరోలను కించపరిచేందుకు ప్రయత్నించారు. అమెరికా విలువలు చెరిపేయాలని చూశారు. మన గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. మన లక్ష్యాలను దూరం చేసేలా వ్యవహరించారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు