అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించి.. తర్వలో అగ్రరాజ్యం అధ్యక్ష పీఠం అధిరోహించనున్న జో బైడెన్ పాలన.. భారత్, చైనా సహా ఇతర ప్రపంచ దేశాలకు ఎలా పరిణమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మాజీ దౌత్యవేత్త అశోక్ సజ్జనార్ ఈటీవీ భారత్‌తో సవివరంగా మాట్లాడారు. ముఖ్యంగా బైడెన్ ప్రెసిడెన్సీ ప్రపంచ దేశాల పట్ల ఎలా ఉండబోతోంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అనే అంశాలపై ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
బైడెన్ విజయాన్ని భారత్ సహా.. బీజింగ్ నుంచి బెర్లిన్ వరకు ఇతర దేశాలు ఎలా అన్వయించుకోవాలి?
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక అంతర్జాతీయంగా అనేక కీలక మార్పులు తీసుకురానుంది. అంతకుముందు.. సజావుగా సాగాల్సిన అంతర్జాతీయ సంబంధాలను డోనాల్డ్ ట్రంప్ చర్యలు, విధానాలు పూర్తిగా విచ్ఛిన్నం చేశాయి. మిత్రదేశాలైన ఈయూ, నాటో సభ్య దేశాలు.. ఆఖరుకు పొరుగున ఉన్న కెనడా, మెక్సికో అలాగే జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలతో ఆయన దుందుడుకుగా వ్యవహరించి వాటిని నొప్పించారు. కాబట్టి యుఎస్-మిత్రదేశాలకు ఇతర దేశాలకు మధ్య దౌత్య సంబంధాలు సాధారణ స్థితికి రావటం ప్రపంచం చూడబోయే మొదటి మార్పు.
ఇక దౌత్య సంబంధాల నిర్వహణలో స్థిరత్వం, స్పష్టత రాబోతోంది. విదేశీ విధానాల నిర్వహణలో ఉండే సూక్ష్మస్థాయి అంశాలు ట్రంప్ పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. బైడెన్ పగ్గాలు చేపట్టారంటే ఇదంతా మారిపోతుంది. అలాగే, ట్రంప్ అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలిగారు. కీలకమైన ప్యారిస్ వాతావరణం ఒప్పందంలో తిరిగి చేరడం బైడెన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ముందువరసలో ఉంటుంది.
రెండోది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇందులోనూ అమెరికా తిరిగి చేరుతుందని నా నమ్మకం. ఇక ట్రాన్స్-పసిఫిక్ సహకార ఒప్పందం విషయంలో ఏం జరిగేదీ చెప్పలేం. ఎందుకంటే, ట్రంప్ ఓడిపోయినా... ట్రంపిజం దేశంలో సజీవంగానే ఉంది. 'అమెరికా ఫస్ట్' విధానం ప్రాతిపదికగా ఆయన సృష్టించిన సుంకాల అడ్డుగోడలు, విదేశీ దిగుమతుల మీద పొరుగుసేవల మీద విధించిన ఆంక్షలు, చేపట్టిన విధానాలు.. మహమ్మారి సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన నేపథ్యంలో కొంతకాలం కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే.. మధ్యప్రాచ్యంలో గడచిన నాలుగేళ్లలో పెనుమార్పులు సంభవించాయి. ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇరాన్ ఇప్పటికే యురేనియం శుద్ధి చేపట్టిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.
ప్రజాస్వామ్యంలేని నియంత్రణ కొరవడిన చైనాకు.. బైడెన్ విజయం మరో సవాలు అవ్వనుందా?
చైనా సవాలుకు బైడెన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరమైన అంశం. చైనా నుంచి ముప్పు విషయంలో అమెరికాలో అందరిదీ ఒకటే మాట. ప్రపంచ అగ్రదేశంగా ఉన్న అత్యంత శక్తివంతమైన యునైటెడ్ స్టేట్స్‌ను ఎలాగైనా సరే ఆ స్థానం నుంచి తోసిరాజు అవ్వాలన్న దృఢసంకల్పంతో ఉన్న చైనాను... అమెరికన్లు ముప్పుగా, ప్రత్యర్థిగా మాత్రమే కాదు.. ఒక శత్రుదేశంగానూ చూస్తున్నారు. చైనాను కట్టడి చేసే విధానం ఇక మీద కూడా కొనసాగుతుంది. అయితే, వ్యూహం తీరు కొంత భిన్నంగా ఉండొచ్చు. జో బైడెన్ చైనాతో చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. వాణిజ్య లేదా సాంకేతిక పరమైన ఒప్పందం కుదుర్చుకునే వీలూ ఉంది.