అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. కరోనా నియంత్రణలో విఫలమయ్యారని ఆరోపణలు రావడం, స్వయంగా కరోనా బారిన పడటం వల్ల ట్రంప్ కంటే బైడెన్‌కు ప్రజల మద్దతు పెరిగిందని పలు పోల్స్ తమ నివేదికలలో పేర్కొన్నాయి. అయితే కొవిడ్-19 చికిత్స తర్వాత మళ్లీ ప్రచారాల్లో పాల్గొన్న ట్రంప్.. తిరిగి పుంజుకుంటున్నట్లు హిల్ హ్యారిస్ఎక్స్ నిర్వహించిన ఓ పోల్సర్వేలో తేలింది.
నాలుగు పాయింట్లు..
ట్రంప్, బైడెన్‌కు ప్రజా మద్దతు దాదాపుగా సమాన స్థాయిలోనే ఉంటోంది. ఇదే సంస్థ గత నెలలో చేసిన సర్వేలో ఇద్దరి మధ్య అంతరం 5 పాయింట్లు ఉండగా.. తాజాగా అది నాలుగుకు చేరింది. నవంబర్ 3న ఎన్నికల తేదీకి ఇంకా 12 రోజుల గడువు మాత్రమే ఉంది.
సర్వే ప్రకారం.. డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్‌కు దాదాపు 46 శాతం మంది ఓటేసేందుకు సుముఖంగా ఉన్నారు. గత నెలలో ఆ శాతం 47 వద్ద ఉండేది. అయితే నెల రోజుల వ్యవధిలోనే అంతరం ఒక పాయింట్ తగ్గడం ట్రంప్ జోరును సూచిస్తోందని ఆ సంస్థ పేర్కొంది. ట్రంప్‌కు 42 శాతం ఓటర్ల మద్దతు లభిస్తోంది.