అమెరికా... ప్రపంచ దేశాల ప్రజల కలల రాజ్యం. అమెరికాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలన్నది అనేకమంది లక్ష్యం. ఇందుకు అగ్రరాజ్యంలో ఉండే స్వేచ్ఛ, అక్కడి వసతులు, జీవనశైలి ప్రధాన కారణాలు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదిగింది అమెరికా.
అయితే ఇవన్నీ కొన్ని నెలల ముందు వరకు. ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటివరకు కరోనా కేసులు, మరణాలతో అల్లాడిపోయిన అగ్రరాజ్యం.. ఇప్పుడు నల్లజాతీయుడి మరణంతో తీవ్ర సంక్షోభంలోకి జారిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం ప్రజాగ్రహానికి మరో కారణమైంది.
అప్పుడే మొదలైంది...
ఎన్నో నెలలుగా సాగిన వాణిజ్య యుద్ధానికి స్వస్తి పలుకుతూ చైనా-అమెరికా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అక్కడితో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది.
జనవరి నుంచే నిశ్శబ్దంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టిన ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్.. మార్చి నుంచి అగ్రరాజ్యంలో తన విశ్వరూపాన్ని చూపించడం ప్రారంభించింది. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కేసులు, మరణాలు అమెరికాలో నమోదయ్యాయి.
లాక్‌డౌన్‌తో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. న్యూయార్క్ వంటి ప్రముఖ నగరాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. అమెరికా నిరుద్యోగుల జాబితాలో మరో 4 కోట్ల మంది చేరారు.
ఆ మరణంతో...
అమెరికాలో ఇప్పటికీ వేలల్లో వైరస్ కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. కానీ మిన్నెపోలిస్‌లో ఓ నల్లజాతీయుడి మరణంతో నూతన సంక్షోభానికి తెరలేచింది.
మిన్నెపొలిస్‌లో ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సోమవారం రాత్రి ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌ను అనుమానితుడిగా గుర్తించి విచారించేందుకు వెళ్లారు. సంకెళ్లు వేసి జార్జ్ మెడపై ఓ పోలీసు అధికారి మోకాలు బలంగా ఉంచాడు. ఊపిరి తీసుకోలేక జార్జి ప్రాణాలు కోల్పోయాడు. ఆ పోలీసును అధికారులు అరెస్టు చేశారు.
అప్పటికే ఆరోగ్య- ఆర్థిక సంక్షోభంతో నలిగిపోయిన అమెరికన్లు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ భారీగా రోడ్లపైకి వస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. అనేక నగరాలు అట్టుడుకుతున్నాయి.