జో బైడెన్... 50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా, రెండుసార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా చేసినా ఎంత పేరు సంపాదించారో తెలియదుగానీ... ట్రంప్‌ను ఎదుర్కొని దేశ విదేశాల్లో ఇప్పుడందరి దృష్టిలో పడ్డారు! 77 ఏళ్ల బైడెన్ అమెరికాకు అత్యంత పెద్దవయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించబోతున్నారు.
ముచ్చటగా మూడోసారికి...
నిజానికి అధ్యక్ష పదవిపై బైడెన్ మనసు పడటం ఇదే తొలిసారి కాదు. ఇప్పుడు ఘనవిజయం సాధించిన బైడెన్ తొలి రెండు ప్రయత్నాల్లో అవమానాలే ఎదుర్కొన్నారు. 1988లో తొలిసారి 40 ఏళ్ల కుర్రతనం ఉరకలెత్తుతుంటే.. బైడెన్ అధ్యక్షుడు కావాలనుకున్నారు. కానీ తన ఉపన్యాసాల్లో వేరేవాళ్లను కాపీకొట్టినట్లు తేలడం వల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. 2008లో మరోమారు బరిలోకి దిగాలనుకుంటే... డెమొక్రాటిక్ ప్రాథమిక అభ్యర్థిత్వానికే పెద్దగా మద్దతు లభించలేదు. కానీ, అదే సంవత్సరం ఒబామా తనను ఉపాధ్యక్ష పదవికి ఎంచుకున్నారు. విదేశాంగ వ్యవహారాల్లో ఒబామాకు పరిష్కారకర్తగా, సలహాదారుగా వ్యవహరించారు.
కష్టాల కడలిలోంచి...
ఐరిష్ కాథలిక్ కుటుంబంలో 1942 నవంబరు 20న పుట్టారు. బైడెన్‌కు ముగ్గురు తోబుట్టువులు. ఆర్థికంగా తొలుత కుటుంబం బాగానే ఉన్నా... బైడెన్ పుట్టే సమయానికి ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో తాతమ్మల వద్దే కుటుంబం గడపాల్సి వచ్చింది. తండ్రి తర్వాత సెకండ్‌హ్యాండ్ కార్ల అమ్మకాల్లో స్థిరపడ్డారు. బైడెన్ చదువుల్లో అంతంతే గానీ... క్లాసులీడర్‌గా ఉండేవారు. ఫుట్‌బాల్, బేస్‌బాల్ ఆడేవారు. సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి 1968లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
ఉపన్యాసానికి లక్ష డాలర్లు...
మధ్యతరగతి నుంచి వచ్చిన బైడెన్ తన స్వయంకృషితో అమెరికాలోని మిలియనీర్ల జాబితాలో చేరారు. పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా చాలా సంపాదించారు. 2019లో విడుదల చేసిన లెక్కల ప్రకారం భార్యాభర్తలిద్దరూ పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా 15లక్షల డాలర్లు సంపాదించారు. 2017లో తన కుమారుడు బ్యూ క్యాన్సర్‌పై రాసిన పుస్తకం కొద్దికాలం పాటు అత్యధిక ప్రాచుర్యంగల పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
విదేశాంగనీతిలో నిపుణుడైన బైడెన్ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ఉపన్యాసాలిస్తుంటారు. ఒక్కో ఉపన్యాసానికి సుమారు లక్ష డాలర్లు ఫీజుకింద తీసుకుంటారు. న్యూజెర్సీ యూనివర్సిటీలో ఇచ్చిన ఓ ఉపన్యాసానికైతే దాదాపు రెండు లక్షల డాలర్లు వచ్చిందని సమాచారం. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెన్‌బైడెన్ సెంటర్ ఫర్ డిప్లమసీ అండ్ గ్లోబల్ ఎంగేజ్‌మెంట్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా బైడెన్ దాదాపు 5.5 లక్షల డాలర్లు సంపాదించారు. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ కలసి 2019లో దాదాపు 10 లక్షల డాలర్లు అమెరికా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించారు.
- ఐస్‌క్రీమ్ అంటే భలే ఇష్టం. సగం చాక్లెట్, సగం వెనీలా కలిపి తినటాన్ని ఇష్టపడతారన్నది మనవరాళ్ళ మాట.
- 1991లో గల్ఫ్‌యుద్ధాన్ని వ్యతిరేకించారు. ఇరాక్‌పై యుద్ధానికి మద్దతిచ్చారు.
- ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒసామా బిన్ లాడెన్‌ను చంపాలని నిర్ణయించుకుంటే... అది రిస్క్‌తో కూడుకున్నదని ఉపాధ్యక్షుడైన బైడెన్ వారించారట. అయినా ఒబామా తన నిర్ణయంతోనే ముందుకు వెళ్లారు!
ప్రమాదాలు విషాదాలు
బైడెన్ జీవితంలో ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. 1972లో తన తొలిభార్య నెలియా, ఏడాది పాప... కిస్మస్ షాపింగ్ నుంచి వస్తూ కారు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కుమారులు గాయపడ్డారు. ఇద్దరు అబ్బాయిలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో కుమారుడి పక్కన నిలబడే తొలిసారి సెనెటర్‌గా ప్రమాణం స్వీకారం చేశారు. కుమారుడు బ్యూ తండ్రి బాటలో పయనించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. డెలావర్ రాష్ట్రానికి అటార్నీ జనరల్ అయ్యాడు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే దశలో... 2015లో 46 ఏళ్ల వయసులో బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించాడు. ఇది బైడెన్‌కు రెండో షాక్!
ఆమెతో జీవితం మారింది...
1975లో జిల్ బైడెన్‌ను కలిశారు. రెండేళ్ళ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అప్పటికే జిల్ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. జిల్ కంటే బైడెన్ 8 సంవత్సరాలు పెద్ద! బైడెన్‌కు మొదటి భార్య ద్వారా పుట్టిన పిల్లలకు జిల్ మంచి తల్లయింది. వీరిద్దరికి 1981లో కూతురు (ఆష్లే) పుట్టింది. తానిప్పుడు సామాజిక కార్యకర్త. ప్రస్తుతం బైడెన్-జిల్‌లకు ఐదుగురు మనువలు మనువరాళ్లు! జిల్ ప్రోత్సాహంతోనే బైడెన్ రాజకీయాల్లో చురుగ్గా ముందుకు కదిలానంటారు.
పోతాడని పాస్టర్‌ను పిలిపించారు...
ఆరోగ్యం విషయంలో బైడెన్ చాలా జాగ్రత్తగా ఉంటారు. 77 ఏళ్ళ వయసులోనూ పరుగులాంటి వేగంతో నడవగలుగుతున్నారు. మందు, సిగరెట్లలాంటి అలవాట్లు లేవు. మందుకు పూర్తిగా దూరం. 80 కిలోల బరువుతో.. వారానికి ఐదు రోజులు వ్యాయామం చేస్తారు. 1988లో ఓసారి మాత్రం బైడెన్‌కు తీవ్ర అనారోగ్యం చేసింది. మెదడుకు శస్త్రచికిత్స కూడా చేశారు. ఇక పోతాడనుకొని... చర్చి పాస్టర్‌ను కూడా పిలిపించారు.