జెఫ్ బెజోస్.... దిగ్గజ వ్యాపార సంస్థ అమెజాన్ అధిపతి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. అలాంటి వ్యక్తి మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడం సాధ్యమేనా? ఔననే అంటోంది బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక 'ద గార్డియన్'. చేసింది కూడా సాధారణ హ్యాకర్ కాదని, ఏకంగా సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని చెబుతోంది.
అసలేం జరిగింది...?
ద గార్డియన్ కథనం ప్రకారం... "హ్యాకింగ్ వ్యవహారం 2018లో జరిగింది. అప్పట్లో జెఫ్ బెజోస్, సల్మాన్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. తరచూ వాట్సాప్‌లో చాట్ చేసుకునే వారు. అలానే మే 1న బెజోస్‌కు సౌదీ అరేబియా యువరాజు నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఒక వీడియో ఫైల్ ఉంది. దానిపై క్లిక్ చేయగానే అమెజాన్ బాస్ ఫోన్ హ్యాక్ అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే పెద్దమొత్తంలో సమాచారం బెజోస్ ఫోన్ నుంచి బయటకు వెళ్లిపోయింది."
అయితే... బెజోస్ ఫోన్ నుంచి ఏం సమాచారం చోరీకి గురైంది, తర్వాత ఏం జరిగిందన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు 'ద గార్డియన్'.