అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 25వ రాజ్యాంగ సవరణ కింద సాగనంపాలని డెమొక్రట్లు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు ట్రంప్. 25వ రాజ్యాంగ సవరణతో తనకు ఎలాంటి ప్రమాదం లేదని, కానీ జో బైడెన్, ఆయన పరిపాలన విభాగాన్ని వెంటాడుతుందని హెచ్చరించారు.
తన చివరి పర్యటనలో భాగంగా మెక్సికో సరిహద్దు టెక్సాస్‌లోని అలామోలో నిర్మించిన గోడను సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ప్రతినిధుల సభలో అభిశంసనపై బుధవారం ఓటింగ్ జరగనున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"25వ రాజ్యాంగ సవరణతో నాకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, జో బైడెన్, ఆయన పరిపాలన విభాగాన్ని వెంటాడుతుంది. మీరు కోరుకుంటున్న దానితో జాగ్రత్తగా ఉండండి. అభిశంసన అనేది మన దేశ చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు చర్యకు కొనసాగింపు. అది కోపం, నొప్పిని కలిగిస్తుంది. అమెరికాకు చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా ఈ సున్నితమైన సమయంలో."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఘోరమైన తప్పు: ట్రంప్
ట్విట్టర్ తన ఖాతాను శాశ్వతంగా నిషేధించిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు అధ్యక్షుడు ట్రంప్. తన ఖాతాలను తొలగించటాన్ని తప్పు పట్టారు. 'సామాజిక మాధ్యమాల ఖాతాలను నిషేధించటం, రద్దు చేస్తూ పెద్ద టెక్ సంస్థలు తీసుకున్న నిర్ణయం ఘోరమైన తప్పు అవుతుంది. మన దేశానికి హాని చేసే భయంకరమైన పనిని బాడా టెక్ కంపెనీలు చేస్తున్నాయని భావిస్తున్నానని పేర్కొన్నారు ట్రంప్.
తోసిపుచ్చిన పెన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు 25వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని చేసిన వినతిని తొసిపుచ్చారు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్. ఈ మేరకు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు. 'మన రాజ్యంగంలోని 25వ సవరణకు అర్థం ఓ వ్యక్తిని శిక్షించటానికో, అన్యాయంగా అధికారం దక్కించుకునేందుకో కాదు. అలా చేయొద్దు. 25వ సవరణను ప్రారంభించటం భయంకర పరిణామాలకు దారితీస్తుంది. మీకు భాగా తెలుసు. 25వ సవరణ అధ్యక్షుడి అసమర్థత, వైకల్యాన్ని పరిష్కరించటానికి రూపొందించినది.' అని పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి నుంచి కోలుకోవడానికి ఇదే సరైన సమయమని, అమెరికన్లు ఐక్యంగా కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:నాపై అభిశంసన తీర్మానం హాస్యాస్పదం: ట్రంప్