చంద్రయాన్ రేసులో అమెజాన్ చంద్రునిపై మనిషి నివాసం ఏర్పరుచుకునే దిశలో మరో ప్రయత్నం. వ్యాపార దిగ్గజం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ చంద్రునిపైకి ఓ అంతరిక్ష నౌకను పంపనున్నట్లు ప్రకటించారు. అమెజాన్ అనుబంధ సంస్థ బ్లూ ఆరిజిన్ నిర్వహించే ఈ ప్రయోగం తేదీ ఎప్పుడన్నది జెఫ్ ప్రకటించలేదు. అయితే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 2024 లక్ష్యం అందుకోగలమని ఆశాభావం వ్యక్తంచేశారు.
"ఇది బ్లూ మూన్. ఈ అంతరిక్ష వాహనంపై గత మూడేళ్లుగా పనిచేస్తున్నాం. ఇది చాలా పెద్దది. 3.6 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ నౌక చంద్రునిపై కచ్చితమైన చోట సున్నితంగా ల్యాండ్ అవుతుంది. ఈ తరహాలోనే ఇంకాస్త పెద్దదైన నౌక 6.5 మెట్రిక్ టన్నుల బరువుతో ఉపరితలంపై సున్నితంగా దిగగలదు."
-జెఫ్ బెజోస్, అమెజాన్ అధినేత
బ్లూ మూన్ వాహక నౌక.. ఓ చిన్న ఇల్లు పరిణామంలో ఉంటుంది. సాంకేతిక పరికరాలు, నాలుగు రోవర్లు, మనుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని మోసుకెళ్లగలదు.
"బ్లూ మూన్ పై భాగం చాలా సామాన్యంగా రూపొందించాం. పై అరలో రకరకాల పేలోడ్స్ అమర్చుకోవచ్చు. డావిట్ వ్యవస్థను నౌకల నుంచి ప్రేరణ పొంది రూపొందించాం. చంద్రుని ఉపరితలంపై వస్తువులు దించేందుకు దీన్ని వినియోగిస్తాం. పేలోడ్స్‌ను బట్టి డావిట్ వ్యవస్థలోని పాదాలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది ఓ పెద్ద రోవర్. ఇది అంతపెద్ద రోవర్ అయినా... ఇలాంటివి నాలుగింటిని ఒకేసారి చంద్రునిపైకి తీసుకెళ్లగలదు ఈ నౌక."
-జెఫ్ బెజోస్, అమెజాన్ అధినేత
చంద్రుడి దక్షిణ ధ్రువంపై బ్లూ మూన్‌ను ల్యాండ్ చేయాలన్నది లక్ష్యం. అక్కడ మంచు నిక్షేపాలు ఉన్నట్లు 2018లోనే ధ్రువీకరించారు. ఆ నీటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే అవకాశముంది. అలా సౌర వ్యవస్థపై పరిశోధనలు మరింత విస్తృతం చేయాలన్నది జెఫ్ బెజోస్ ఆలోచన. ఈసారి చంద్రుడిపై మనిషి నివాసం ఉండేందుకు సమయం ఆసన్నమైందంటూ బ్లూ మూన్ ప్రాజెక్టుపై అంచనాలు పెంచేశారు అమెజాన్ అధిపతి.
నాసా 2024లో చంద్రునిపైకి మానవులను తీసుకెళ్లే లక్ష్యంగా తలపెట్టిన ప్రాజెక్టుకు సహకరించే దిశగా... ఈ ప్రయోగం నిర్వహించనున్నారని తెలుస్తోంది.