తెలంగాణ

telangana

ETV Bharat / international

Corona: తల్లిదండ్రులను కోల్పోయిన లక్షల మంది చిన్నారులు - కొవిడ్​-19 వైరస్​

కొవిడ్​ మహమ్మారి యావత్​ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మందికిపైనే చిన్నారులు.. తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్లు లాన్సెట్​ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఒక్క భారత్​లోనే 1.19లక్షల మంది పిల్లలపై ప్రభావం పడినట్లు పేర్కొంది.

children lost caregivers to Covid
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారు

By

Published : Jul 21, 2021, 3:09 PM IST

ఏడాదిన్నర కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి విలయంలో హృదయవిదారక కోణమిది. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన ఈ మాయదారి మహమ్మారి.. ఎంతో మంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. లక్షల మంది పిల్లలను దిక్కులేనివారిని చేసింది. కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15లక్షల మందికి పైనే చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్లు లాన్సెట్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. ఒక్క భారత్‌లోనే 1.19లక్షల మంది పిల్లలపై కరోనా కాఠిన్యం చూపించింది.

2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్‌ వరకు 14 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 15,62,000 మంది చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకుల్లో(బామ్మా తాతయ్యలు లేదా ఇతర బంధువులు) కనీసం ఒకరిని కోల్పోయినట్లు లాన్సెంట్‌ నివేదిక వెల్లడించింది. ఇందులో 10,42,000 మంది తల్లీ/తండ్రీ లేదా ఇద్దరినీ కోల్పోయినట్లు తెలిపింది. తల్లుల కంటే నాన్నలను కోల్పోయిన చిన్నారులు ఐదు రెట్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా మెక్సికోలో 1.41లక్షల మంది పిల్లలు అమ్మానాన్నలు లేదా ఇతర సంరక్షకులను కోల్పోయారు. బ్రెజిల్‌, భారత్‌, అమెరికా దేశాల్లోనూ ఈ సంఖ్య లక్షకు పైనే ఉంది.

భారత్‌లో 1.19లక్షల మంది..

మహమ్మారి కారణంగా భారత్‌లో 1,19,000 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా సంరక్షకుల్లో ఒకరిని కోల్పోయినట్లు లాన్సెట్‌ పేర్కొంది. ఇందులో 1.16లక్షల మందికి తల్లీ/తండ్రీ లేదా ఇద్దరినీ దూరం చేసినట్లు తెలిపింది. భారత్‌లో 25,500 మంది పిల్లలు తల్లులను కోల్పోగా.. 90,751 మంది చిన్నారులు తండ్రి ప్రేమకు దూరమయ్యారు.

"ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి రెండు కరోనా మరణాలకు.. ఒక చిన్నారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోతుండటం విషాదకరం. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించగా.. 15లక్షల మంది పిల్లలకు కన్నవారు/సంరక్షకులు దూరమయ్యారు."

- డాక్టర్‌ సూసన్‌ హిల్లీస్‌, అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ లీడ్ ఆథర్‌.

ఇదీ చూడండి:'దేశంలో ఇంకా 33% మందికి కరోనా ముప్పు!'

ABOUT THE AUTHOR

...view details