నైజీరియా కాట్సినా రాష్ట్రంలోని ఓ పాఠశాలకు చెందిన 400 మంది చిన్నారులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. ఆయుధాలు ధరించిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలపై దాడికి పాల్పడినట్లు ఆ దేశ పత్రిక వాన్గార్డ్ వెల్లడించింది. పాఠశాల గార్డ్స్పై కాల్పులు జరిపారని పేర్కొంది.
కంకర గవర్న్మెంట్ సైన్స్ సెకండరీ స్కూల్లో శుక్రవారం ఈ దాడి జరిగింది. ఆ రోజు 800 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. అయితే ఎంతమంది కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది పారిపోయి బయటపడ్డారనే విషయంపై పూర్తి స్పష్టత లేదు.
"పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు వస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం మొత్తం వెనక్కి వచ్చినవారి సంఖ్య 406కు చేరింది"అని కాట్సినా విద్యా శాఖ కమిషనర్ బదమాసి చరాంచీ పేర్కొన్నారు. కొంతమంది పిల్లలు రాత్రంతా పొదల్లో దాక్కొని వచ్చారని అధికారులు తెలిపారు.