మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫార్మ్ ట్విట్టర్‌ను సస్పెండ్ చేసినట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ చేసిన ట్వీట్‌ను సామాజిక మాధ్యమం డిలీట్ చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని వేర్పాటువాద ఉద్యమాన్ని ఉద్దేశించి బుహారీ వివాదాస్పద ట్వీట్ చేశారు.
అయితే.. ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగానే ప్రకటించిన కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్విటర్‌ను సస్పెండ్ చేస్తున్నామని ట్విటర్లోనే చెప్పడమేంటని కొందరు అన్నారు. మరికొందరు వీపీఎన్ ద్వారా ఈ మాధ్యమాన్ని వినియోగిస్తామని, ప్రభుత్వం నిర్ణయంతో తమకు పనిలేదని అంటున్నారు. నైజీరియా సర్కారు ట్విట్టర్‌పై కీలక ప్రకటన చేసినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి వరకు వినియోగదారులు తమ ఖాతాను ఉపయోగించుకున్నారు.