తెలంగాణ

telangana

ETV Bharat / international

సుడాన్​: అధ్యక్షుడైన ఒక్కరోజుకే రాజీనామా - అధ్యక్షుడు

ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క రోజులోనే సుడాన్​ సైన్యాధ్యక్షుడు జనరల్​ అహ్మద్ అవాద్ ఇబిన్ ఔఫ్ రాజీనామా చేశారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్లువెత్తిన ప్రజా నిరసనలకు తలొగ్గారు ఔఫ్. తదుపరి సారథిగా జనరల్​ అబ్దెల్​ ఫతా అల్​-బుర్హాన్ అబ్దుల్​రహ్మాన్​ కొనసాగుతారని ప్రకటించారు.

ఒక్కరోజులోనే సుడాన్ అధ్యక్షుడు రాజీనామా!

By

Published : Apr 13, 2019, 11:09 AM IST

Updated : Apr 13, 2019, 12:20 PM IST

సుడాన్​: అధ్యక్షుడైన ఒక్కరోజుకే రాజీనామా

సుడాన్​​లో సైనిక తిరుగుబాటుతో అధికారాన్ని దక్కించుకున్న మిలిటరీ కౌన్సిల్​కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రజల నిరసనలతో కౌన్సిల్​ సారథి జనరల్​ అహ్మద్ అవాద్​ ఇబిన్ ఔఫ్ ప్రమాణం చేసిన ఒక్కరోజులోనే రాజీనామా చేశారు.

నిరసనలే కారణం

సైనిక చర్య అనంతరం మిలిటరీ కౌన్సిల్​కు వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసనలు చేపట్టారు. దేశాధ్యక్షుడు ఒమర్​ను గద్దె దించి అవాద్​ మహ్మద్​కు పట్టంగట్టడం సరికాదని ఆందోళనలు చేశారు. ఒక వ్యక్తిని దించి అలాంటి మరో వ్యక్తికే అధికారం అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధానిలోని మిలిటరీ కేంద్ర కార్యాలయం వద్ద బైఠాయించారు. అవాద్​నూ గద్దెదించి, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం సైనికులపై పోరుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఒత్తిడికి తలొగ్గారు ఔఫ్.

తిరుగుబాటుతో అధికారం

30 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్​ అల్​ బషీర్​ను ఆ దేశ ప్రజలు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఆహార పదార్ధాల ధరలు మూడు రెట్లు కాగా సుడాన్​ వాసులు గత సంవత్సరం డిసెంబర్​లో తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు.

ఈ పరిణామాలతో సైన్యం తిరుగుబాటు చేసింది. మిలిటరీ కౌన్సిల్​ పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తుందని దేశ రక్షణ శాఖ మంత్రి అవాద్​ అహ్మద్​ ఇబిన్ ఔఫ్ ప్రకటించారు. ఈ కౌన్సిల్​కు ఆయనే సారధిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

నెల రోజుల వరకు దేశంలో కర్ఫ్యూ, మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి... సరిహద్దును, గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. రెండేళ్ల పాటు సైనిక పాలన కొనసాగుతుందన్నారు. అనంతరం దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయన్న అవాద్.. చివరకు ప్రజా వ్యతిరేకతకు తలొగ్గారు​.

తదుపరి సారథి

జనరల్​ అబ్దెల్​ ఫతా అల్​-బుర్హాన్​ అబ్దుల్​రహ్మాన్ తన స్థానాన్ని భర్తీ చేస్తారని ప్రకటించారు అవాద్. ఆయన సారథ్యంలో సుడాన్ సురక్షిత తీరాలకు చేరుతుందని ఆకాంక్షించారు.

Last Updated : Apr 13, 2019, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details