తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2021, 2:30 PM IST

Updated : Apr 10, 2021, 2:48 PM IST

ETV Bharat / international

మళ్లీ మిడతల దండయాత్ర- రంగంలోకి సైన్యం!

ఆఫ్రికాలోని కెన్యాలో మిడతల దండు స్థానికులను హడలెత్తిస్తోంది. కరవు, కరోనా కారణంగా ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోగా.. ఇప్పుడు వీటి వ్యాప్తి కట్టడి చేయకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనావాస ప్రాంతాల్లో ఈ మిడతలు రావడం వల్ల ఇంతకుముందులా రసాయనాల పిచికారీ కుదరదని.. అలా చేస్తే ప్రజల ఆరోగ్యానికే ప్రమాదకరమని ప్రభుత్వం భావిస్తోంది.

locusts attack in kenya, కెన్యాలో మిడదల దండు ప్రభావం
కెన్యాను కలవరపెడుతున్న మిడతల దండు

కెన్యాలో మిడతల దండయాత్ర

అకస్మాత్తుగా రావడం.. పచ్చదనాన్ని నాశనం చేసి వెళ్లిపోవడం మిడతల దండు స్వభావం. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణించి ఆ మార్గంలో ఉన్న పంట పొలాలు, చెట్లపై వాలిపోతాయి. పంటను తిని మరో ప్రాంతానికి దండెత్తుతాయి. వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మచ్చుకు మన దేశానికి కూడా గతేడాది అనుభవమైంది. ఇప్పుడు ఇవే మిడతల దండు తూర్పు ఆఫ్రికాలోని కెన్యా, ఇథియోపియాను వణికిస్తోంది.

మిడతల దాడి

అసలే కరోనా మహమ్మారి, కరవు, ఆర్థిక సంక్షోభంతో తిప్పలు పడుతున్న ఆ దేశాలకు ఇప్పుడు ఈ దండు పెద్ద గుది బండగా మారింది. ముఖ్యంగా కెన్యాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ రెండో దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా కెన్యాలోనే జరుగుతున్నాయి. వాటిని పారదోలేందుకు సైనికులు కూడా రంగంలోకి దిగారు అంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతాలు, జనావాసాలు కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిచికారీ చేస్తూ.. వాటిని కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

"మేము ఇప్పటికే చాలా నష్టపోయాము. పంట అంతా నాశనమైంది. పశువులు కూడా చనిపోయే స్థితికి చేరుకున్నాయి. కుటుంబాన్ని ఎలా పోషించాలో దిక్కుతోచని స్థితి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి."

-హన్నా న్యోకాబీ, రైతు

కెన్యాపై గతేడాది కూడా మిడతల దాడి జరిగింది. ఆ దేశంలో గత 70 ఏళ్లలో జరిగిన అతిపెద్ద మిడతల దాడి అదేనని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. పిచికారీ ద్వారా వాటిని కట్టడి చేశారు. అయితే అప్పట్లో మిడతల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు జనావాసానికి కాస్త దూరం ఉండటం వల్ల పెద్దగా పంట నష్టం జరగలేదు. కానీ ఇప్పుటి పరిస్థితి అందుకు భిన్నం. సోమాలియా నుంచి వచ్చిన ఈ దండు ఈసారి జనజీవనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. దీంతో వీటిని పిచికారి చేసి కట్టడి చేయడం సవాల్​గా మారుతోంది. నీరు కలుషితం అవడం, పశువులపై ప్రభావం చూపడం సహా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉండటమే అందుకు కారణం.

కళ్ల ముందే పంట నాశనం అవుతున్నా.. ఏమీ చేయలేకపోతున్నామని ప్రజలు, ప్రభుత్వం ఆందోళన చెందుతున్నారు.

ఈ దండును పారదోలేందుకు ఇసియోలోని తమ స్థావరం నుంచి సైనికులు 257 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ బరాకర్​ అనే ప్రాంతానికి చేరుకున్నారు. కెన్యాకి అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతంలో మిడతల దాడి జరగడం ఆ దేశస్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

మిడతలను పారదోలేందుకు పిచికారీ
మిడతల దండుపై పిచికారీ

కిలోమీటరుకు సుమారు 150 మిలియన్​ మిడతలు ఉంటాయని.. ఇవి రోజుకు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించగలవని నిపుణులు చెప్తున్నారు. 2,500 మంది తినే ఆహారాన్ని ఒక్క రోజులో తింటాయని పేర్కొన్నారు.

"ఈ పురుగులు ఇంకా పూర్తి స్థాయిలో వృద్ధి చెందకపోవడం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకుంటాయి. రోజుకు రెండు గ్రాముల ఆహారాన్ని ఆరగిస్తాయి. ఇది వాటి బరువు కన్నా రెండితలు ఎక్కువ. త్వరలో నాట్లు కూడా ప్రారంభమవుతాయి. ఈలోగా వాటిని కట్టడి చేయకపోతే భారీ నష్టం వాటిల్లుతుంది."

-ఆంబ్రోయ్​ న్యాటిచ్​, ఫుడ్​ అండ్​ అగ్రి కల్చర్​ ఆర్గనైజేషన్

పెద్దలకు కన్నీరు.. పిల్లలకు లాభసాటి

మిడతల దండు పెద్దలను కన్నీరు పెట్టిస్తుంటే పిల్లలకు మాత్రం లాభసాటిగా మారింది. వీలైనన్ని మిడతలను సేకరిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఎన్ని మిడతలు పట్టుకుంటే అంత డబ్బు ఇస్తామని కోళ్లు, పశువుల వ్యాపారం చేసే పలు సంస్థలు వారికి ఆశచూపుతున్నాయి. మిడతల ద్వారా వాటికి ఆహారం అందిచడం సులభం అవుతుందన్నది వారి ఆలోచన. 10 కేజీల మిడతలను పట్టుకుంటే 1000 షిల్లంగులు ఇస్తామని ఆఫర్​ చేస్తున్నారు.

అయితే ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సేకరించిన మిడతలలో క్రిమిసంహారక మందలకు ప్రభావితమైనవి కూడా ఉండే అవకాశం ఉంటుందన్నారు.

"కొందరు ఈ మిడతలను తమ కోళ్లకు ఆహారంగా, ఎరువులు తయారు చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. అందుకోసం మమ్మల్ని ఈ మిడతలను సేకరించమన్నారు. ఓ 10 కేజీల బ్యాగ్​ నిండా మిడతలు సేకరిస్తే మాకు 1000 షిల్లింగ్​లు ఇస్తామని చెప్పారు. 20 కేజీలు అయితే 2000 షిల్లింగ్​లు. రాత్రి వేళల అవి నిద్రిస్తున్న సమయంలో వాటిని పట్టుకుంటున్నాం."

-హెరీసన్ ఒనియాంగ్​, స్థానికుడు

అదొక్కటే ఆశ..

ఈ మిడతల సమూహానికి చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర కానీ, ప్రజల వద్ద కానీ ఎలాంటి ప్రణాళికలు లేకపోయినా.. అందరికీ ఈ మిడతలు త్వరలో వాటంత అవి నశించిపోతాయనే ఆశ ఉంది. తక్కువ వర్షపాతం కారణంగా మిడతలు వృద్ధి చెందలేవని, ఇదే కొనసాగితే త్వరలోనే అవి నశించిపోతాయని నిపుణులు వెల్లడించారు.

ఇవీ చదవండి :బ్రెజిల్​లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

మోడెర్నా టీకాతో 6 నెలల పాటు రక్ష!

Last Updated : Apr 10, 2021, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details