తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంపై ఒకవైపు కరోనా.. మరోవైపు మిడతల దండయాత్ర - పంటల నష్టం

ప్రపంచాన్ని మిడతలు బెంబేలెత్తిస్తున్నాయి. వేలెడంత కూడా లేని ఈ కీటకాలు వివిధ దేశాల్లోని లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. కోట్లమంది ఆహార భద్రతకు పెనుముప్పు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మిడతల దాడికి ఆఫ్రికా విలవిలలాడుతోంది. ఇది 25 ఏళ్లలో కనీవినీ ఎరుగని తీవ్రస్థాయి దాడి అని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) తెలిపింది.

Grasshoppers are damaging the world after Corona!
కరోనా తర్వాత అంతగా బంబేలెత్తిస్తున్నది మిడతలే!

By

Published : Feb 3, 2020, 7:59 AM IST

Updated : Feb 28, 2020, 11:22 PM IST

ప్రపంచాన్ని కరోనా తర్వాత అంతగా బంబేలెత్తిస్తున్నది మిడతలదాడి. వేలెడంత కూడా లేని ఈ కీటకాలు వివిధ దేశాల్లోని లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. కోట్లమంది ఆహార భద్రతకు పెనుముప్పు కలిగిస్తున్నాయి. వీటిని కట్టడి చేయడానికి కోట్ల డాలర్లు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం మిడతల దాడికి ఆఫ్రికా విలవిలలాడుతోంది. ఇది 25 ఏళ్లలో కనీవినీ ఎరుగని తీవ్రస్థాయి దాడి అని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) తెలిపింది.

ఇప్పటికే భారత్‌లో రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌లో 3.5 లక్షల హెక్టార్లలో పంటను ఈ కీటకాలు నాశనం చేశాయి. భారత ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో వాటి కట్టడికి చర్యలు చేపట్టింది. 1993 తర్వాత ఇంత భారీ స్థాయిలో మన దేశంపై మిడతలు దాడి చేయడం ఇదే మొదటిసారి. యెమన్‌, సోమాలియా, సూడాన్‌ల నుంచి పాకిస్థాన్‌ గుండా ఇవి భారత్‌కు చేరాయి.

మిడతా భుక్తి

మానవుల కన్నా ముందే కీటకాలు ఈ ప్రపంచాన్ని ఏలాయి. నేలమాళిగ నుంచి పర్వత శిఖరాగ్రం వరకూ అవి వ్యాపించి ఉన్నాయి. వీటిలో కొన్ని మానవాళికి ప్రయోజనకరం కాగా.. మరికొన్ని మాత్రం పెను ముప్పును కలిగిస్తున్నాయి. వాటిలో అత్యంత నష్టదాయక కీటకాలు మిడతలు. ప్రపంచంలో పలు దేశాలను ఇప్పుడు ఇవి హడలెత్తిస్తున్నాయి. అసలే వాతావరణ మార్పులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా ఇప్పుడు ఈ కీటకాలు కూడా తోడై సర్వనాశనం చేస్తున్నాయి.

ఎన్ని జాతులు?

కరోనా తర్వాత అంతగా బంబేలెత్తిస్తున్నది మిడతలే!

మిడతల్లో ప్రధానంగా పది జాతులు ఉన్నాయి. అయితే వీటిలో అత్యంత విధ్వంసకరమైన జాతి ‘ఎడారి మిడత’ (డెజర్ట్‌ లోకస్ట్‌). ఇదే ఇప్పుడు అనేక దేశాల్లో రైతులకు, ప్రభుత్వాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. భారత్‌లో ఎడారి మిడతలు, మైగ్రేటరీ లోకస్ట్‌, బాంబే లోకస్ట్‌, ట్రీ లోకస్ట్‌లు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఎడారి మిడతలదే పెను సవాల్‌.

ఇటాలియన్‌ లోకస్ట్‌, మోరాకన్‌ లోకస్ట్‌, ఏషియన్‌ మైగ్రేటరీ లోకస్ట్‌లు కాకసస్‌, మధ్య ఆసియా (సీసీఏ) ప్రాంతంలో ఆహార భద్రతకు పెను ముప్పుగా పరిణమించాయి. సీసీఏ ప్రాంతంలో 2.5 కోట్ల హెక్టార్ల పొలాలకు, కనీసం 2 కోట్ల మందికి ముప్పు పొంచి ఉంది.

సోమాలియాలో అత్యవసర పరిస్థితి

ప్రస్తుతం మిడత దండు దాడికి ఆఫ్రికా విలవిలలాడుతోంది. కెన్యా, ఇథియోపియా, సోమాలియా, సూడాన్‌, జిబౌటి, ఎరిట్రియాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సోమాలియాలో ఆదివారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. కెన్యాలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో మిడతల బెడద ఉంది. చిన్నచిన్న విమానాలతో పంట పొలాలపై క్రిమిసంహారక మందులను చల్లుతున్నారు. తూర్పు ఆఫ్రికాలో చర్యల కోసం తక్షణం 7.6 కోట్ల డాలర్లు అవసరమని ఐరాస పేర్కొంది. ఈ సమస్యను వేగంగా కట్టడి చేయకుంటే జూన్‌ నాటికి ఈ కీటకాల సంఖ్య 500 రెట్లు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్‌లో మిడతల దండు కలిగిస్తున్న నష్టాన్ని ఎదుర్కోవడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రూ.730 కోట్లను ఖర్చు చేసేందుకు సిద్ధపడింది.

ఎక్కడి నుంచి ఎక్కడికి?

సాధారణ సమయాల్లో ఈ మిడతలు పశ్చిమ ఆఫ్రికా నుంచి భారత్‌ మధ్య ఉన్న 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో నివసిస్తాయి. 30 దేశాల్లో వీటి ఉనికి ఉంటుంది. ప్రధానంగా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఎడారి ప్రాంతాల నుంచి భారీ వర్షాలు పడినచోటుకు ప్రయాణమవుతాయి. దీర్ఘకాలం పాటు వానలు పడటంతోపాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే మూడు నెలల్లోనే తమ సంఖ్యను 20 రెట్లు పెంచుకోగలవు. ఎడారి మిడత మూడు నుంచి 5 నెలల పాటు జీవిస్తుంది. ఇవి భారీ దండులా ఏర్పడతాయి. మహమ్మారిలా విజృంభిస్తాయి. స్వల్ప సమయంలోనే సుదీర్ఘ ప్రయాణాలు చేసి అనేక దేశాలపై విరుచుకుపడతాయి. వాటి విజృంభణ సమయంలో భూమి మీద 20 శాతం భూభాగంపై ప్రభావం ఉంటుంది. 65 దేశాలకు వ్యాపించి విరుచుకుపడతాయి. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది జీవనోపాధిని దెబ్బతీయగలవు.

వేగంగా సర్దుబాటు

వాతావరణం, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మిడతలు వేగంగా మార్పులు చేసుకోగలవు. సున్నా డిగ్రీల సెల్సియస్‌ నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకూ మనుగడ సాగించగలవు. అవసరాన్ని బట్టి తమ జీవన చక్రాన్ని వేగవంతం చేసుకోవడం కానీ నెమ్మదింప చేసుకోవడం కానీ చేసుకోగలవు.

ఒక్కో దండూ కోట్లలో

ఒక్కో మిడతల దండు విస్తృతి ఒక చదరపు కిలోమీటరు నుంచి కొన్ని వందల చదరపు కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఒక దండులో కనీసం 4 కోట్ల మిడతలు ఉంటాయి. కొన్నిసార్లు వీటి సంఖ్య 8 కోట్ల వరకూ పెరగొచ్చు.

ఎంత దూరం.. ఎంత వేగం..?

ఎడారి మిడతలు గాలి వాలుకు అనుగుణంగా ఎగురుతాయి. గంటకు 16-19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్కో దండు రోజుకు 5-150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

కట్టడి ఎలా?

ప్రస్తుతం మిడతల దండును కట్టడి చేయడానికి ఉపయోగిస్తున్న విధానం.. ఆర్గానోఫాస్ఫేట్‌ రసాయనాలను స్వల్ప గాఢత కలిగిన డోసుల్లో పిచికారి చేయడం. వాహనాలు, విమానాల ద్వారా వీటిని చల్లుతున్నారు. అయితే రసాయనాలతో కాకుండా జీవపరమైన విధానాలతో వీటిని కట్టడి చేసేందుకు విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి.

చిన్న దండు.. 35వేల మంది ఆహారం హాంఫట్‌

ఒక్కో మిడత తన శరీర బరువుకు సమాన స్థాయిలో ఆహారాన్ని భుజిస్తుంది. సుమారు రోజుకు రెండు గ్రాముల మేర తిండి తింటుంది. ఈ లెక్కన ఒక చదరపు కిలోమీటరు మేర వ్యాపించిన ఒక చిన్న మిడతల దండు 35వేల మంది మనుషులు లేదా 20 ఒంటెలు లేదా 6 ఏనుగులు తిన్నంత ఆహారాన్ని ఒక్క రోజులోనే తినేస్తాయి.

పచ్చదనం మాయం

తమ ప్రయాణ మార్గంలో అన్ని రకాల పచ్చదనాన్ని, పంటలను ఈ కీటకాలు నాశనం చేస్తాయి. ఆకులు, పూలు, పండ్లు, విత్తనాలు, బెరడును తినేస్తాయి. భారీగా చెట్లపై వాలడం వల్ల వాటి సామూహిక బరువుకు చెట్లు కూడా దెబ్బతింటాయి. మొత్తం మీద అక్కడ పొలాలు నాశనమవుతాయి. పశుగ్రాసం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ ఆహార భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతుంది. కరవు, ఆర్థిక నష్టాలు వాటిల్లతాయి.

ఇదీ చూడండి:కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు

Last Updated : Feb 28, 2020, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details