తూర్పు ఆఫ్రికాలో గత రెండు నెలలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు నీటమునిగాయి. వరదలకు నదుల్లోని మట్టి ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోత వానలకు ఇప్పటి వరకు కనీసం 265 మంది మరణించి ఉంటారని అధికారుల అంచనా. ఈ వర్షాలు ఇంకా మరికొన్ని రోజులు కొనసాగొచ్చని తూర్పు ఆఫ్రికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
20 లక్షల మంది నిరాశ్రయులు..
ఈ భారీ వర్షాల కారణంగా కెన్యా, సోమాలియా, బురుండి, టాంజానియా, దక్షిణ సూడాన్, ఉగాండా, డిబౌటీ, ఇథియోపియాలో దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది పశువులు గల్లంతయ్యాయి.
సోమాలియా కేంద్రంగా ముంచుకొస్తున్న భారీ తుపానుతో మరో వారం పాటు ఆ ప్రాంతంలో వర్షాలు మరింత పెరుగుతాయనే వాతావరణ శాఖ అంచనాలు స్థానికుల్లో భయాలు పెంచుతున్నాయి.