తెలంగాణ

telangana

ETV Bharat / international

సుడాన్​లో సైనిక తిరుగుబాటు-​ అధ్యక్షుడి నిర్బంధం

సైనిక తిరుగుబాటు వల్ల సుడాన్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధ్యక్షుడు ఒమర్​ అల్​ బషీర్​ను సైన్యం అదుపులోకి తీసుకుంది. 30 ఏళ్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని సుడాన్​వాసులు సంబరాలు జరుపుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సైన్యాన్ని అమెరికా కోరింది.

సైనిక తిరుగుబాటుతో కుప్పకూలిన సుడాన్​ ప్రభుత్వం

By

Published : Apr 12, 2019, 8:42 AM IST

Updated : Apr 12, 2019, 9:27 AM IST

సైనిక తిరుగుబాటుతో కుప్పకూలిన సుడాన్​ ప్రభుత్వం

సైనిక తిరుగుబాటుతో సుడాన్​ ప్రభుత్వం కుప్పకూలింది. అధ్యక్షుడు ఒమర్​ అల్​ బషీర్​ను అదుపులోకి తీసుకున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అవాద్​ మహమ్మద్​ ఇబ్​నౌఫ్​ ప్రకటించారు. నెల రోజుల వరకు దేశంలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపారు. మూడు నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి... సరిహద్దును, గగనతలాన్ని మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. రెండేళ్ల పాటు సైనిక పాలన కొనసాగుతుందని తెలిపారు. అనంతరం దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు అవాద్​.

సంబరాలు...

ఒమర్​ నిరంకుశ పాలనకు నిరసనగా ఎన్నో ఏళ్లుగా సుడాన్​లో ఆందోళనలు జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా దేశంలో నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. సైనిక తిరుగుబాటుతో ఒమర్​ అల్​ బషీర్​ 30 ఏళ్ల పాలనకు తెరపడింది. రక్షణ మంత్రి ప్రకటన అనంతరం సంబరాలతో సుడాన్​ రాజధాని ఖార్టుమ్​ వీధులు హోరెత్తాయి. ఒమర్​ ప్రభుత్వం నుంచి తమకు ఇన్నేళ్లకు విముక్తి లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

అవాద్​పైనా నిరసనలు...

దేశంలో ఒక పక్క సంబరాలు జరుగుతున్నా... మరోపక్క సైనిక చర్యకు వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసనలు చేపట్టారు. ఒమర్​ను గద్దె దించి అవాద్​ మహ్మద్​కు పట్టంగట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని దించి అలాంటి మరో వ్యక్తికే అధికారం అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యంలో అవాద్​కు మించిన నాయకులున్నారని ఉద్ఘాటించారు. అవాద్​నూ గద్దెదించి, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం సైనికులపై పోరుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు.

అమెరికా స్పందన...

సుడాన్​లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆ దేశ సైన్యాన్ని కోరింది. రెండేళ్ల సైనిక పాలన అనంతరం ఎన్నికలు జరుగుతాయన్న అవాద్​ ప్రకటనను తప్పుపట్టింది. తమను పాలించే వారిని ఎన్నుకోవడంలో సుడాన్​వాసులకు పూర్తి హక్కు ఉందని స్పష్టం చేసింది.

Last Updated : Apr 12, 2019, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details