కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ, ఫీజు మాఫీ తెచ్చింది : జ్యోతి గౌడ్ - ghmc election updates
కాంగ్రెస్ హయాంలో ఫీజు మాఫీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తెస్తే.. కోవిడ్ రోగులకు సరైన చికిత్స అందించటంలో తెరాస వైఫల్యం చెందిందని నల్లకుంట డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి యాదగిరి గౌడ్ ఆరోపించారు. తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
నల్లకుంట డివిజన్ ప్రజలకు రేయింబవళ్లు అందుబాటులో ఉండి డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని శ్రీమతి జ్యోతి యాదగిరి గౌడ్ తెలిపారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే డివిజన్ అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడి పని చేస్తానన్నారు. తెరాస పార్టీ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి పెన్షన్లు ఆపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన నాయకులు తమ పార్టీ కార్యకర్తలకే వేలకు వేలు ఇచ్చుకున్నారు తప్ప నిజమైన అర్హులైన సామాన్య ప్రజలకు సహాయం అందలేదని విమర్శించారు. గెలిపిస్తే డివిజన్లో కలుషిత తాగునీటి సరఫరా సమస్యకు చెక్ పెడతామని, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, మూసీ కాలువకు రిటైనింగ్ వాల్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.