'యశోద'.. సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ చిత్రానికి హరీష్ - హరి దర్శకులు. తమిళంలో విజయవంతమైన పలు చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకులు వీళ్లు. 'యశోద'ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. హిందీతోపాటు దక్షిణాది భాషల్లో చిత్రం విడుదలని పురస్కరించుకుని విలేకర్లతో ముచ్చటించిందీ దర్శకద్వయం. ఏమన్నారంటే..
"ఎప్పుడూ కొత్త రకమైన కథని చెప్పాలనేదే మా ప్రయత్నం. ఆ కథని ఎలా చెబుతున్నామనేది కూడా ముఖ్యమే. మేం గతంలో తమిళంలో చేసిన సినిమాల్లాగా, కథ చెప్పడం పరంగా 'యశోద' విషయంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా స్థాయి కూడా పెద్దది. ఇలాంటి కథని ఈ స్థాయిలో చెప్పడం అవసరం కూడా.
కథానాయిక సమంతతోపాటు, ఇతర ప్రధాన తారగణం, సాంకేతిక బృందం తోడయ్యాక సినిమా పరిధి మరింతగా పెరిగింది. మేం ఈ కథని సమంతని దృష్టిలో పెట్టుకునే రాశాం. కానీ ఆవిడ చేస్తుందో లేదో మాకు అప్పటికి తెలియదు. అందుకే తక్కువ నిర్మాణ వ్యయం అంచనాతోనే కథని రాసుకున్నాం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ కథ చెప్పాక ‘అంతర్జాతీయ స్థాయిలో చెప్పాల్సిన కథ ఇది. పాన్ ఇండియా సినిమాగా చేద్దాం’ అన్నారు. సమంతని కలిశాక ఆమెది కూడా అదే అభిప్రాయమే".
సమంత ఆరోగ్య పరిస్థితి గురించి మాకు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే తెలిసింది. అంతకుముందు ఓ రోజు ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక సాయంత్రం సమంతకి జ్వరంగా ఉందని తెలిసింది. అంతే తప్ప, ఏ రోజూ చిత్రీకరణలో సమంత ఇబ్బంది పడలేదు.
సంగీత దర్శకుడు మణిశర్మ, ఛాయాగ్రాహకుడు సుకుమార్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి... ఇలా మంచి సాంకేతిక బృందం తోడైంది. ఆ ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. తదుపరి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలోనే మరో సినిమా చేస్తాం.".