గత కొంతకాలంగా హిందీ చిత్రాలేవీ ఆశించిన విజయాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. మూస ధోరణిలో సాగే కథలు, శ్రుతి మించిన యాక్షన్, శృంగారం లాంటివి ఉంటే సినిమా ఆడేస్తుందన్న భ్రమల నుంచి దర్శక నిర్మాతలే కాదు, కథానాయకులు సైతం బయటకు రాలేకపోయారు. దీనికి అగ్ర కథానాయకులు కూడా మినహాయింపేమీ కాదు. ఒకప్పుడు అభిమాన హీరో ఎలాంటి సినిమా తీసినా చూసే ప్రేక్షకుడే ఆ తర్వాత చిత్రాలను నిర్ద్వందంగా తిరస్కరించటం మొదలు పెట్టాడు. అదే సమయంలో సరికొత్త కథలు, నేపథ్యాలతో దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రాలపై హిందీ ప్రేక్షకులకు నెమ్మదిగా ఆసక్తి ఏర్పడింది. ఓటీటీల రాకతో అది తారస్థాయికి చేరింది.
దెబ్బ మీద దెబ్బ పడుతున్నా మారని తీరు!:వరుస పరజయాలు పలకరిస్తున్నా బాలీవుడ్ హీరోలు మూసధోరణి కథలను వదిలిపెట్టకపోగా, భారీ బడ్జెట్‌లు పెట్టి మరీ తీయడం మొదలు పెట్టారు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన 'సామ్రాట్ పృథ్వీరాజ్' అనే చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రమే అందుకు ఉదాహరణ. అక్షయ్ కుమార్, సంజయ్‌దత్, మానుషి చిల్లార్, సోనూ సూద్, అశుతోష్ రాణా లాంటి భారీ తారాగణంతో సీనియర్ డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.80 కోట్ల వసూళ్లు రాబట్టి, బాలీవుడ్ ఖాతాలో మరో డిజాస్టర్‌గా నిలిచింది.
ఇదే కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ చేసిన 'ధాకడ్' పరిస్థితీ ఇంకా దారుణం. సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 4 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. అలాగే ఈ ఏడాది విడుదలైన 'రన్ వే 34', 'హీరో పంటి 2', 'బచ్చన్ పాండే', 'అటాక్' వంటి పెద్ద చిత్రాలు సైతం కనీస కలెక్షన్లు లేక కనుమరుగైపోయాయి. అధిక బడ్జెట్‌తో, భారీ హంగులతో విడుదలైనా ఈ చిత్రాలలో ఏదీ కనీసం రూ.100 కోట్ల మార్కును దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో దక్షిణాది చిత్రాలు 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కేజీయఫ్ 2' చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి.
మారాల్సిందేంటి?: 'ఇండియన్ సినిమాలన్నీ ఒకే అంశం చుట్టూ తిరుగుతాయి' - ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ఒకప్పుడు చెప్పిన మాట ఇది. బాలీవుడ్ సినిమాల ధోరణికి ఇదిప్పుడు సరిగ్గా సరిపోతుంది. (అప్పుడు కూడా ఆయన బాలీవుడ్ సినిమాలను దృష్టిలో పెట్టుకునే అన్నారు) ఒక పక్క దక్షిణాది సినిమాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు తీస్తుంటే ఇంకా మూస కథలనే నమ్ముకుంటున్నారు బాలీవుడ్ డైరెక్టర్లు. భారీ హిట్‌లు కావాలంటే హిరాణి, తివారీ, భన్సాలీ, భండార్కర్‌ల వైపు చూసే రోజులు పోయాయని గుర్తించలేకపోతున్నారు. ప్రేక్షకుడికి కావాల్సిదేంటో తెలియక కొత్త దర్శకులు తికమకపడి దక్షిణాది సినిమాల వైపు చూస్తున్నారు.
ఇక హీరోలు సైతం ప్రేక్షకులను అర్థం చేసుకోవటంలో విఫలమవుతున్నారు. ఇతర చిత్ర పరిశ్రమలో యువ హీరోలు కొత్త కథలతో సంచలనాలు సృష్టిస్తుంటే బాలీవుడ్ సినిమా హిట్ కొట్టడానికి యాభై ఏళ్లు పైబడిన హీరోలపైనే ఆధారపడుతోంది. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడి కుర్ర హీరోలు ఎంత వెనకబడ్డారో. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ దక్షిణాది చిత్రాలను ఒకప్పుడు చులకనగా చూసిన బాలీవుడ్... ఆ ఫార్ములాకు అలవాటు పడిన హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక నానా తంటాలు పడుతోంది.