తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అప్పుడే తెలుసు వాల్తేరు వీరయ్య హిట్​ అని.. ఉపాసనకు అబ్బాయి పుడితే బాగుంటుంది' - ప్రొడ్యూసర్​ సుస్మిత కొణిదెల

'రంగస్థలం', 'సైరా నరసింహారెడ్డి' లాంటి విజయవంతమైన చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ అందించారు మెగాస్టార్​ కుమార్తె సుస్మిత కొణిదెల. తాజాగా వాల్తేరు​ వీరయ్య సినిమాలో కూడా చిరంజీవిని వింటేజ్‌ లుక్‌తో ఆమె సరికొత్తగా చూపించారు. ఈ సందర్భంగా సుస్మిత పంచుకున్న ముచ్చట్లివిగో.

sushmita konidela special interview
sushmita konidela

By

Published : Jan 14, 2023, 7:45 AM IST

సుస్మిత కొణిదెల అంటే అభిరుచి గల నిర్మాతే కాదు.. మంచి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా. 'రంగస్థలం', 'సైరా నరసింహారెడ్డి' లాంటి విజయవంతమైన చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ అందించి మెప్పించారు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవిని వింటేజ్‌ లుక్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బాబీ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుస్మిత.

ఈసారి సంక్రాంతి సంబరాలు ఎలా ఉండనున్నాయి?
"మా సంబరాలు భోగి నుంచే మొదలవుతాయి. ఆరోజు అందరం ఉదయం 5గంటల కల్లా లేచి నాన్నగారి ఇంట్లోనే భోగి మంటలు వేసుకుంటాం. ఆ తర్వాత టిఫిన్లు, భోజనాలు అక్కడే. సాయంత్రం వరకు ఆటలాడుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపేస్తాం. నాకు గాలిపటాలు ఎగరేయడం సరిగా రాదు. ఈసారైనా నేర్చుకోవాలనుకుంటున్నా (నవ్వుతూ)".

తెరపై మీ నాన్నను 'వాల్తేరు వీరయ్య'గా చూసినప్పుడు మీకేమనిపించింది?
"ఇది నాన్నకు బాగా కలిసొచ్చిన కంఫర్ట్‌ జోన్‌. ఇలాంటి కమర్షియల్‌ కథలు ఆయనకు బాగా నప్పుతాయి. చిత్రీకరణ సమయం నుంచే ఆయన దీన్ని ఓ పండగలా అనుభూతి చెందే వారు. సెట్‌కు ఎంతో ఉత్సాహంగా వెళ్లేవారు. అప్పుడే తెలుసు వాల్తేరు వీరయ్య హిట్టని".

వీరయ్య పాత్ర కాస్ట్యూమ్స్‌ కోసం ఎలాంటి రీసెర్చ్‌ చేశారు?
"దర్శకుడు బాబీ కథ చెప్పాక నాతో అన్న మాట ఒకటే.. 'మేము వింటేజ్‌ చిరంజీవిని చూపించాలనుకుంటున్నాం' అన్నారు. 'గ్యాంగ్‌లీడర్‌', 'ముఠామేస్త్రి' తరహాలో ఉండాలనేసరికి పెద్దగా రీసెర్చ్‌ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే నాన్నని చిన్నప్పటి నుంచి అలా చూస్తూనే పెరిగాం. వీరయ్య పాత్ర, ఆ పోర్టు వాతావరణం, సినిమా కలర్‌ థీమ్‌.. ఇలాంటి అన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకుని నాన్నకు ఎలాంటి కాస్ట్యూమ్స్‌ అయితే బాగుంటాయో ముందుగానే ఓ స్పష్టతకు వచ్చేశా".

కాస్ట్యూమ్స్‌ విషయంలో నాన్న సలహాలు తీసుకుంటారా?
"కచ్చితంగా నాన్నతో మాట్లాడే నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే ఆయనకున్న అనుభవం వల్ల సినిమాలో ఆయా సీన్‌కు తగ్గట్లుగా ఎలా కనిపిస్తే బాగుంటుందనేది నాకన్నా తనకే బాగా తెలుసు. ఈ చిత్రంలో తను కట్టుకునే లుంగీలు ఎలా ఉండాలి.. దానికి ఎలాంటి మెటీరియల్‌ వాడాలి.. తను పెట్టుకునే కళ్లద్దాలు ఎలా ఉంటే బాగుంటుంది అన్నవి ఆయనే చెప్పారు. ఈ విషయంలో అమ్మ కూడా తన సలహాలు పంచుకుంది. నాన్నకు ఎలాంటి దుస్తులు బాగుంటాయి.. ఏవి బాగోవు అన్నది ఆమె చూడగానే చెప్పేస్తుంది. ఇందులో ఆయన వింటేజ్‌ లుక్‌లో కనిపించినా.. ఆయన కాస్ట్యూమ్స్‌ మొత్తం ఈతరం ప్రేక్షకులు మెచ్చేలా ట్రెండీగానే ఉంటాయి".

నిర్మాతగా మీ బ్యానర్‌లో నాన్నతో సినిమా చేసే ఆలోచనలున్నాయా?
"నాకనే కాదు.. ప్రతి నిర్మాతకీ ఆయనతో సినిమా చేయాలని ఉంటుంది. నేనెప్పుడైనా ఈ ప్రస్తావన తీసుకొస్తే.. 'మంచి కథ తీసుకురా వెంటనే చేసేద్దాం'అంటుంటారు (నవ్వుతూ). ప్రస్తుతం ఆ కథల వేటలోనే ఉన్నాం."
"రామ్‌చరణ్‌ - ఉపాసన తల్లిదండ్రులు కానున్నారు అన్నది మా కుటుంబానికి చాలా పెద్ద శుభవార్త. ఈ వార్త కోసం మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. నాకు మేనల్లుడిని అందిస్తాడా.. మేనకోడల్ని ఇస్తాడా అన్నది చూడాలి. మాకైతే ఎవరైనా ఓకే. కాకపోతే మా ఇంట్లో ఇప్పటికే నలుగురు అమ్మాయిలం అయిపోయాం. కాబట్టి అబ్బాయి పుడితే చాలా బాగుంటుంది".

ABOUT THE AUTHOR

...view details