మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మరో రోజులో సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో చిరు పాల్గొంటున్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో.. బాస్ పార్టీ సాంగ్ చిత్రీకరణ విషయంలో తాను అసంతృప్తి చెందినట్లు వచ్చిన వార్తపై స్పందించారు. తాను నిరాశ చెందిన మాటే నిజమేనని క్లారిటీ ఇచ్చారు.
Waltair Veerayya: ఆ విషయంలో చిరు అసంతృప్తి.. ఎందుకంటే? - సంక్రాంతికి వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు సంబంధించి ఓ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ వివరాలు..
"వాల్తేరు వీరయ్య మూవీ కోసం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. ఆ విషయం మీకు ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అయితే, బాస్ పార్టీ అనే సాంగ్ కోసం వాళ్లు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ సెట్‌ను వేశారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ వేసిన ఆ సెట్ నన్ను మైమరిచిపోయేలా చేసింది. ఎంతలా అంటే.. అతడిని పొగుడుతూ ఒక ట్వీట్ కూడా చేశాను. సాధారణంగా నాకు సెట్ నచ్చితే, అప్పటికప్పుడే వాళ్లని ప్రశంసించడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి చేస్తాను. కానీ ప్రకాశ్ విషయంలో మాత్రం నేను ట్వీట్ వేశానంటే, అది ఎంతలా నన్ను ఆకట్టుకుందో మీరే అర్థం చేసుకోండి. అయితే.. ఆ సెట్‌ను అవసరానికి మించి చేశారన్న భావన కలిగింది. దాన్ని సరిగా ఉపయోగించారు అని మాత్రం నాకు అనిపించలేదు. ఈ విషయంలో నాకు అసంతృప్తిగా ఉంది. కేవలం అన్ని కోట్ల విలువైన సెట్‌ను ఒక పాట కోసమే వాడుకోవడం నిరాశకు గురి చేసింది" అని చిరు అన్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుంది. శ్రుతిహాసన్ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి:సంక్రాంతి వేళ అగ్ర హీరోలతో సందడి చేస్తున్న అందాల భామలు వీరే