Vishnu Vishal Twitter Post Chennai Rains :బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ వరదల్లో చిక్కుకున్నారు. కరెంట్, సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక దాదాపు 24 గంటల పాటు చిక్కుకుపోయారు. తమకు సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రెస్క్యూ బృందాలు స్పందించి సహాయక చర్యలు చేపట్టడం వల్ల చివరకు అతి కష్టం మీద బయటపడ్డారు.
దాదాపు 24 గంటల పాటు వరదల్లో చిక్కుకున్నారు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్. ఆ తర్వాత చెన్నైలో తాను నివాసం ఉంటున్న పరిసరాల్లో వరద పరిస్థితిని వివరిస్తూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. వర్ష బీభత్సానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. తాను నివసిస్తున్న కారప్పాకంలోని ఇంట్లోకి వరద నీరు వచ్చిందని తెలిపారు. క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోందని పోస్టులో పేర్కొన్నారు. 'కరెంట్, ఇంటర్నెట్ లేదు. ఫోన్ సిగ్నల్ కూడా సరిగా అందడం లేదు. ఇంటిపై ఓ చోట మాత్రమే సిగ్నల్ వస్తుంది. అక్కడ నుంచే ఇది పోస్ట్ చేస్తున్నా. నాకు, ఇదే ప్రాంతంలో ఉంటున్న వారికి సాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నై ప్రజల అవస్థను చూస్తుంటే బాధగా ఉంది' అని విష్ణు విశాల్ తన పోస్ట్‌లో తెలిపారు.
ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే ఫైర్, రెస్క్యూ విభాగాలు స్పందించాయి. రంగంలోకి దిగి కారప్పాకం ఏరియాలో సహాయక చర్యలు చేపట్టాయి. హీరోలు అమిర్ ఖాన్, విష్ణు విశాల్‌లో పాటు తదితరులను కారప్పాకం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విష్ణు విశాల్ మరో పోస్ట్ పెట్టారు. తమను రక్షించిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియిజేశారు. కష్ట సమయంలో ఆదుకుందని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అయితే ఆమిర్ ఖాన్ చెన్నైలో ఏం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.