తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Vishal Censor Board : ఇకపై ఆన్​లైన్​లోనే సినిమా సెన్సార్..​ విశాల్‌ ఆరోపణలపై CBFC బోర్డు కీలక నిర్ణయం - సెన్సార్​ బోర్డు లేటెస్ట్ న్యూస్

Vishal Censor Board : నటుడు విశాల్‌ చేసిన ఆరోపణలపై సెన్సార్‌ బోర్డు స్పందించింది. అవినీతికి పాల్పడింది సెన్సార్‌ సభ్యులు కాదని.. థర్డ్‌పార్టీ వారని తెలిపింది. సినిమాల సెన్సార్‌ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే చేయాలనే కీలక నిర్ణయం తీసుకుంది.

Vishal Censor Board
Vishal Censor Board

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 10:50 PM IST

Vishal Censor Board :ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందంటూ నటుడు విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై.. అత్యవసర సమావేశం అనంతరం సెన్సార్‌ బోర్డు స్పందించింది. విశాల్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసింది సెన్సార్‌ సభ్యులు కాదని.. థర్డ్‌పార్టీ వారని వెల్లడించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ- సినీప్రమాన్‌ను వేదిక చేసుకోవాలని దర్శక, నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది. నిబంధనలు పాటిస్తూ నిర్ణీత సమయంలోనే సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. "సీబీఎఫ్‌సీ ప్రతి సంవత్సరం 12 వేల నుంచి 18 వేల చిత్రాలకు సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఇన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది. కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారు" అని గుర్తు చేసింది.

విశాల్‌ చేసిన ఆరోపణలు ఇవే?
తాను నటించిన మార్క్‌ ఆంటోని సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపిస్తూ విశాల్‌ కొన్ని రోజుల క్రితం ట్వీట్‌ చేశారు. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ. 6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన చెప్పారు. 'అవినీతి గురించి తెరపై చూడడం సరే, గానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇది జరుగుతోంది. నా 'మార్క్‌ ఆంటోని' సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ పనులు పూర్తయ్యేందుకు మొత్తం రూ. 6.5 లక్షలు లంచం ఇచ్చా. ఇందులో స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం మరో రూ. 3 లక్షలు చెల్లించా. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మరో దారిలేక డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకు కూడా ఇలా జరగకూడదు. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా" అని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ మేరకు ఆ ఇద్దరి ట్విట్టర్​ ఖాతాలను ట్యాగ్‌ చేశారు విశాల్​. ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలనూ పోస్ట్‌లో పెట్టారు. దీనిపై స్పందించిన సెన్సార్డు బోర్డు సమావేశం నిర్వహించింది.

ABOUT THE AUTHOR

...view details