'విక్రమ్'.. 'విక్రమ్'.. 'విక్రమ్'.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. విశ్వనటుడు కమల్‌హాసన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. మొదటివారంలోనే సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే 'విక్రమ్' సక్సెస్‌ని చిత్రబృందం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సక్సెస్, థ్యాంక్స్ మీట్‌లు నిర్వహించిన టీమ్.. తాజాగా తమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీలో కమల్‌హాసన్, చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ పాల్గొన్నారు. తమ చిత్రానికి భారీ విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. విక్రమ్ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. విజయ్‌తో లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించనున్న తదుపరి చిత్రం విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. లోకేశ్ కనకరాజ్ మాట్లాడుతూ.. 'విక్రమ్' విజయం బాధ్యత పెంచిందని, ఇకపై మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించేందుకు శ్రమిస్తానని అన్నారు.