Vijaydevarkonda Auto rickshaw టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలకు దగ్గరవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచింది మూవీటీమ్. హీరో హీరోయిన్లు విజయ్, అనన్య పాండే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలను చుట్టేస్తూ తమ సినిమాను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడి స్థానికులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారితో కలిసి సందడి చేస్తున్నారు.
అయితే ఇటీవలే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చెప్పులు ధరించి ట్రెండ్ సెట్ చేసిన రౌడీ బాయ్.. ఆతర్వాత ఓ ప్రమోషన్ ఈవెంట్ కోసం హీరోయిన్ అనన్యతో కలిసి ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. ఆ తర్వాత ప్రమోషన్‌లో భాగంగానే ముంబయిలో నిర్వహించిన ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు ఆటో రిక్షాలో వచ్చాడు. లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ జోరున వర్షంలోనే ఆటోలో గమ్య స్థానానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తెల్లటి దుస్తులు ధరించిన విజయ్ హ్యాండ్స్‌మ్‌గా కనిపించాడు. ఇలా తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెల్చుకున్న విజయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
నడుం నొప్పితో ఇబ్బందిపడుతోన్న విజయ్.. 'లైగర్' ప్రమోషన్స్ కోసం ఎంతో శ్రమిస్తున్న విజయ్ తమ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వరుస ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. దీనివల్ల ఆయన తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతోన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తూ విజయ్ నడుం నొప్పి ఇబ్బందిపడుతోన్న ఓ వీడియోని అభిమాని షేర్ చేశాడు. "తీవ్రమైన నడుంనొప్పితో విజయ్ ఇబ్బందిపడుతోన్నట్లు ఈ వీడియో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఆయన ఫ్యాన్స్ మీట్ పెట్టి ఎంతోమందితో ఫొటోలు దిగారు. ఆయన అభిమానిగా ఉన్నందుకు గర్విస్తున్నా" అని పేర్కొన్నాడు. దానిపై ఛార్మి స్పందిస్తూ.. "అవును నిజమే. మీరు బాగా గుర్తించారు. దెబ్బల్ని, నొప్పిని సైతం లెక్కచేయకుండా 'లైగర్' ప్రమోషన్స్ కోసం విజయ్ రేయింబవళ్లూ వరుసగా ప్రయాణాలు చేస్తున్నాడు" అని చెప్పుకొచ్చారు.