Vijay Deverakonda Family Star : 'ఖుషి' సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. సమంత జోడీగా నటించిన ఈ మూవీని ఫ్యాన్స్ పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకున్నారు. అయితే వసుళ్ల విషయంలో మాత్రం మిశ్రమంగానే నడిచింది. ఇక 'ఖుషి' తర్వాత విజయ్.. ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్'(Family Star) అనే ఫ్యామిలీ ప్యాక్ ప్రాజెక్ట్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే పలు కారణాల వల్ల ఈ షెడ్యూల్‌ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 'రౌడీ స్టార్ ఇక సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లే' అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోందట 'ఫ్యామిలీ స్టార్' టీమ్.
మరోవైపు సినిమా విడుదల తేదీని మార్చడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులకు డిస్ట్రీబ్యూటర్లు దొరకలేదని.. అంతే కాకుండా ఓ ఫారిన్ షెడ్యూల్ కూడా పెండింగ్‌లో పడినట్లు ఇన్సైడ్ టాక్. అయితే ఈ షూట్‌ను ముందుగా బ్యాంకాక్‌లో ప్లాన్ చేశారట. కానీ, పలు కారణాల వల్ల వీసాల జారీ విషయంలో ఏదో సమస్య వచ్చి.. దాన్ని అమెరికాకు మార్చుకున్నారట. అయితే ఈ ప్రక్రియ కూడా పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏదేమైనప్పటికీ కేవలం రెండు నెలల సమయంలోనే.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు, స్క్రీన్ల పంపకాలు, ట్రైలర్ ఈవెంట్లు, ప్రీ-రిలీజ్ వేడుకలు, ప్రమోషన్స్ కార్యక్రమాలు.. వీటన్నింటినీ మూవీ టీమ్ పూర్తి చేస్తుందా అనేది ఫ్యాన్స్‌లో మెదులుతున్న ప్రశ్న.
ఇలా పెండింగ్‌లో ఉన్న షూటింగ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకోవడంతో పాటు ఇతర కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సంక్రాంతికే వచ్చేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. టెక్నికల్ పరంగా రిలీజ్‌కున్న సాధ్యాసాధ్యాలను గమనిస్తే సినిమా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.