Vijay Antony Latest News : కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ ఆంటోని జీవితంలో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఆయన పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసింది. 16 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలను వదిలింది. అయితే ఇంతటి దు:ఖంలోనూ ఆయన తన తోటీ నటీనటులు, దర్శకనిర్మాతల కోసం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు.
సాధారణంగా కొంతమంది నటులు తాము నటించిన సినిమాల ప్రమోషన్స్‌లోనూ పాల్గొనడానికి ఆసక్తి చూపరు. కానీ, కూతురును కోల్పోయిన పది రోజుల్లోనే.. ఆ బాధను దింగమింగుకుని మరీ.. తన సినిమా ప్రమోషన్లో విజయ్ పాల్గొనడం అందరినీ ఆలోచింప జేసేలా చేసింది. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో విజయ్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారని తెలిసింది.
కాగా, విజయ్ హీరోగా సీఎస్ ఆముదన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం 'రత్తం'. ఈ సినిమా అక్టోబరు 6న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ తన రెండో కూతురితో కలిసి పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు.. విజయ్ నిబద్ధత కలిగిన నటుడంటూ విజయ్ను ప్రశంసిస్తున్నారు. పెద్ద కుమార్తె లేదన్న బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.