ఓటీటీ.. సినీప్రేక్షకుల్లో జీవితాల్లో ఓ భాగమైపోయింది. కొత్త సినిమాలు చూడాలన్నా.. ధారావాహికలు వీక్షించాలన్నా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయా సంస్థలు విభిన్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రూపొందుతున్నవే వెబ్ సిరీస్‌లు. వీటిల్లో నటించేందుకు వర్ధమాన నటులే కాదు పేరున్న స్టార్లూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తారలు వెబ్ సిరీస్‌ల్లో మెరవగా త్వరలో సందడి చేయబోయే మరికొందరి వివరాలు చూద్దాం..
మల్టీస్టారర్ సిరీస్..నటుడిగా సుదీర్ఘ అనుభవమున్న వెంకటేశ్ ఓటీటీ ఎంట్రీ ఖరారు చేయడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తన సోదరుడి తనయుడు, నటుడు రానా తో కలిసి తాను నటిస్తున్నానని చెప్పడం అంతకుమించి అంచనాలు పెంచింది. ఈ ఇద్దరు కలిసి నటించిన సిరీస్ ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. క్రైమ్ డ్రామా కథాంశంతో రాబోతున్న ఈ ప్రాజెక్టులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ త్వరలోనే ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదలకానుంది. రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో వెంకటేశ్ ఓ ప్రత్యేకగీతంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌ను పూర్తిస్థాయిలో ‘రానా నాయుడు’లో చూడొచ్చు.
భయపెట్టే ధూత..అక్కినేని వారసుడిగా తెరపైకి వచ్చి, విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నాగచైతన్య. ఈయన 'ధూత' అనే సిరీస్‌తో ఓటీటీ బాటపట్టారు. హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాభవానీ శంకర్ కథానాయిక. ఈ సిరీస్‌లో చైతన్య చాలా కొత్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్‌కానుంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అక్కినేని ఫ్యామిలీతో విక్రమ్ కె. కుమార్ గతంలో ‘మనం’ చిత్రం తెరకెక్కించి, మంచి విజయం అందుకున్నారు. మరోవైపు, నాగచైతన్య హీరోగా విక్రమ్ రూపొందించిన ‘థ్యాంక్ యూ’ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
నీళ్ల ట్యాంక్‌తో సుశాంత్..అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకరు. ‘కాళిదాసు’తో నటుడిగా మారిన ఈయన ‘కరెంట్’, ‘అడ్డా’, ‘,చి.ల.సౌ’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘జీ 5’లో ఈ సిరీస్ విడుదలకానుంది.