ఫ్యామిలీ హీరో వెంకటేశ్ తన కొత్త సినిమాను రీసెంట్గా ప్రకటించారు. 'హిట్' సిరీస్‌తో సక్సెస్‌ను అందుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్ మూవీగా ఇది రూపొందనుంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.
వెంకటేష్ 75వ(#Venky75)వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు 'సైంధవ్' అనే పేరును ఖరారు చేశారు. రెండు నిమిషాలు ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో వెంకటశ్ గన్ పట్టుకుని కనిపిస్తూ 'నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీభాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవలే 'శ్యామ్ సింగరాయ' సినిమాతో క్లాసిక్ హిట్‌ను అందుకున్న నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంతోష్ సంగీతం అందిస్తున్నారు.