'పూజలు చేయ పూలు తెచ్చాను'... 'విధి చేయు వింతలెన్నో'... 'ఇన్ని రాశుల యునికి'... 'తొలిమంచు కరిగింది తలుపు తీయరా...' లాంటి అనేక పాటలతో వాణీజయరాం తెలుగు ప్రేక్షకులతో ఎన్నెన్నో జన్మల బంధం వేశారు. చెన్నైలో చదువుకుని, హైదరాబాద్‌లో బ్యాంక్ ఉద్యోగం చేసిన వాణీజయరాం.. తెలుగువారి ఇష్టగాయనిగా మారారు. అటు పిమ్మట వాణీజయరాం గొంతు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో వినిపించింది.
తెలుగులో వాణీకి పేరు తెచ్చిన చిత్రాలివే..
తెలుగులో వాణీజయరాంకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు లెక్క కట్టలేం. 'స్వప్నం', 'అంతులేని కథ', 'మరోచరిత్ర', 'ఘర్షణ', 'మల్లెపూవు', 'గుప్పెడు మనసు', 'ఇది కథ కాదు', ' సీతాకోక చిలక', 'పూజ', 'శ్రుతిలయలు', 'స్వర్ణకమలం', 'స్వాతికిరణం' ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. ఆమె ప్రముఖ కథక్ మేస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్‌తో అనేక ఆల్బమ్‌లు చేశారు.
ఎస్పీ బాలూకు, వాణీ జయరాం.. తొలి అవకాశం కాకతాళీయం..
ఎస్.పి.బాలూకు తొలి అవకాశం ఇచ్చిన కోదండపాణీయే 'అభిమానవంతులు' సినిమాతో వాణీజయరాంకు కూడా తొలి అవకాశం ఇవ్వడం కాకతాళీయం. కానీ ఈ గొంతు గాన పూజకు వచ్చిందని 'పూజ' సినిమాయే తెలుగు ప్రేక్షకులకు చెప్పింది. రాజన్ – నాగేంద్ర చేసిన 'పూజ' పాటలు తెలుగు దేశాన మోగిపోయాయి. 'ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది' పాటను ప్రతి ఉదయం నాష్టా పొయ్యి మీద పెడుతూ, మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తూ, రాత్రిళ్లు పిల్లలకు పక్కలు సిద్ధం చేస్తూ ఇల్లాళ్లు వేలాదిసార్లు విన్నారు. వింటున్నారు. ఆ సినిమాలోని 'నింగి నేలా ఒకటాయెనే', 'పూజలు చేయ పూలు తెచ్చాను'... పాటలూ వాణీజయరాం గొంతు గిరాకీని శ్రోతల్లో పెంచాయి.
కానీ, తెలుగులో ఆమె ప్రవేశం, కొనసాగింపు స్థిరంగా కొనసాగలేదు. సుశీల, జానకీ 'హీరోయిన్ల గొంతు'గా స్థిరపడి ఉన్నారు. వారిని దాటి వాణీజయరాంకు చోటు దొరకడం అన్నిసార్లు జరిగేది కాదు. కానీ జరిగిన ప్రతిసారీ చిన్న చిరునవ్వుతో, గోరింటాకు పెట్టుకుని పండిన ఎడమ చేతిని ఊపుతూ పాడి మార్కులు ఎగరేసుకొని పోయేవారు. 'ఈ రోజు మంచి రోజు', 'విధి చేయు వింతలెన్నో', 'నువ్వు వస్తావని బృందావని' , 'హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే' , 'నీలి మేఘమా జాలి చూపుమా' , 'సీతే రాముడి కట్నం'... ఈ పాటలన్నీ సిగన మల్లెలు ముడుచుకున్న వనితలా గుమగుమలాడుతూ భావ తరంగాల కిందా మీదకు కారణమయ్యేవి.
అందరినీ అలరిస్తుంది ఆమె గాత్రం..
వాణీజయరాం గొంతులోని విశిష్టత ఏమిటంటే.. అది మహిళలకూ సరిపోయేది.. యంగ్ అడల్ట్స్‌కూ సరిపోయేది. ఇది గమనించిన దర్శకుడు కె.విశ్వనాథ్ 'శంకరాభరణం', 'స్వాతికిరణం', 'శృతిలయలు' సినిమాలలో ఆమె గొంతును సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఆ సినిమాలకు ఆమె గొంతు కేవలం పాటగా మాత్రమే కాదు కథాబలంగా కూడా ఉపయోగపడింది. 'శంకరాభరణం'లో 'బ్రోచే వారెవరురా', 'మానస సంచరరే', 'ఏ తీరుగ నను దయ చూసెదవో'.. ఈ పాటలన్నీ ఆమెకు అవార్డులు తెచ్చి పెట్టాయి.
'స్వాతి కిరణం'లో మాస్టర్ మంజునాథ్‌కు మేచ్ అయ్యేలా వాణీజయరాం పాడిన 'తొలి మంచు కరిగింది', 'ఆనతినీయరా', 'ప్రణతి ప్రణతి ప్రణతి', 'కొండ కోనల్లో లోయల్లో'... అద్భుతం. పునరావృతం లేని కళ అది. వాణీజయరాం గొంతు భిన్న సందర్భాల పాటగా వెలిగింది. 'నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా', 'మిన్నేటి సూరీడు వచ్చెను మా పల్లె' , 'నేనా పాడనా పాట', గీతా ఓ గీతా ... వీటన్నింటికి గట్టి అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్ పాటలే కాదు తెలుగు డబ్బింగ్ గీతాలు కూడా వాణీజయరాంను తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంచాయ్. ఆమె పాడిన 'ఒక బృందావనం.. సోయగం' చిత్రలహరిలో జనం వేయిసార్లు చూశారు.
18 భాషల్లో భక్తి గీతాలు..
భక్తి పాటలు పాడటంలో వాణీజయరాం మహారాజ్ఞిగా వెలుగొందారు. రఘునాథ పాణిగ్రాహి తరువాత జయదేవుని అష్టపదులకు వూపిరినిచ్చిన గాయని వాణీజయరాం. ఆమె దాదాపు 18 భాషల్లో భక్తి గీతాలు ఆలపించారు. సంగీతోత్సవాల్లో వాణీజయరాం పాల్గొని ప్రదర్శనలిచ్చేది. 'బద్రి కేదార్ ఫెస్టివల్', 'గంగా మహోత్సవ్', 'వారణాసి ఉత్సవ్', 'స్వామి హరిదాస్ ఫెస్టివల్' వంటి భక్తి ప్రధాన ఉత్సవాల్లో వాణీజయరాంకి ప్రధమ తాంబూలం దక్కేది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వాణీజయరాం పాల్గొనని కచేరీలే లేవు.
తులసీదాసు, భక్త కబీర్, మీరా, పురందరదాసు, అన్నమయ్య, త్యాగరాజు సంకీర్తనలను సంగీతరూపంలో ముద్రించి భద్రపరిచారు. బ్రిజు మహారాజ్‌తో కలిసి 'టుమ్రి' భజనగీతాలు ఆలపించారు. ప్రఫుల్లకర్ సంగీత సారధ్యంలో ఒడిస్సీ గురుకులచరణ్ మహాపాత్రతో కలిసి 'గీతగోవిందం' ఆల్బం కోసం వాణీజయరాం పాడారు. కుమార గంధర్వతో అత్యంత ప్రజాదరణ పొందిన 'రుణానుబంధచ్య' అనే మరాఠీ శాస్త్రీయ యుగళాన్ని ఆలపించారు. ఈ పాటకు వాణీజయరాం గురువు వసంతదేశాయ్ సంగీతం సమకూర్చారు. ఆమె సొంతంగా స్వరపరచిన 'మురుగన్' భక్తి గీతాలను ఆల్బంగా విడుదలచేశారు.
'సినిమా పాటలకి, భక్తి పాటలకి చాలా వ్యత్యాసం ఉంటుందని.. భక్తి పాటలకు శ్రుతిని, రాగాన్ని, లయని సవరించుకొని పాడే సౌలభ్యత వుందని, అదే సినిమా పాటలైతే సంగీత దర్శకుడు బాణీ కట్టిన స్థాయిలోనే, ఆర్కెస్ట్రా ప్రాక్టీసు చేసిన స్థాయిలోనే పాడాల్సి ఉంటుందని వాణీజయరాం చెబుతారు. భక్తి పాటలకు ఉచ్చారణ, సందర్భం, నేటివిటీ, రాగ ఛాయలు చాలా ముఖ్యమని.. సంస్కృత పదాలను శబ్దాలంకార పూర్వకంగా వుచ్చరించాల్సి ఉంటుందని వాణీ అభిప్రాయం.
సంపాదించిన సొమ్ము.. సంఘానికి ఖర్చు చేశారు..
తనకి స్థానిక భాష రాకున్నా, పదోచ్చారణ, భావం అడిగి తెలుసుకొని ప్రాక్టీసు చేసి పాడుతారు. సింగర్‌కి క్లాసికల్ బేస్ వుంటే రాగ లక్షణాలు అర్థమౌతాయి కనుక మంచి అవుట్ పుట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని వాణీజయరాం అంటారు. ఇప్పుడు వాణీజయరాం ఎక్కువగా భక్తి గీతాల ఆల్బం రికార్డింగు మీద, శాస్త్రీయ సంగీత కచేరీలు చెయ్యటం పై దృష్టి సారించారు. తాము ఆర్జించిన సొమ్మును ఎన్నో సంఘసేవా కార్యక్రమాలకు, అనాధ పిల్ల సంరక్షణకు, చదువులకు వినియోగిస్తుంటారు. వాణీజయరాం చాలా సాధారణంగా వుంటారు.
వాణీజయరాం సింపుల్‌గా ఉండటమే ఘనత అని నమ్ముతారు. ఆమెకు చాలా భాషలు వచ్చు. కవిత్వం రాస్తారు. భజనలు రాస్తారు. సినిమా కథలు కూడా తయారు చేస్తారు. ఆమె జగతితో తానుగా కాక పాటతో సంభాషించాలని కోరుకుంటారు. తీయటి గాయని వాణీజయరాం పాటకు ప్రత్యక్షంగా సేవ చేసి పరోక్షంగా మానవ స్వాంతనకు దోహదపడ్డారు. ఆ గళం నుంచి రాగరంజిత గానం ప్రవహించి దశాబ్దాల నుంచి ప్రేక్షక హృదయాలను సంగీతమయం చేస్తూనే ఉంది. వెండితెర ఉన్నంతవరకు వేలుపుగా నిలుస్తారు వాణీ జయరాం.