మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారట. ఇటీవల జరిగిన ఓ తమిళ సినిమా ఈవెంట్‌లో.. హీరో రామ్‌చరణ్ మూవీకి తానే మ్యూజిక్ కంపోజ్ చేయనున్నానని స్వయంగా రెహమాన్ వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. దీంతో బుచ్చిబాబు.. రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమాకే రెహమాన్ సంగీతం అందించబోతున్నారని.. నెట్టింట్లో చర్చ మొదలైంది. ఈ విషయానికి సంబంధించి చిత్రబృందం స్పందించలేదు. సినిమా యూనిట్ నంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ విషయంపై స్పష్టత వస్తుంది.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా.. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు, సుకుమార్ రైటింగ్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది. షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్సీ 16కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, ఏఆర్ రెహమాన్ మెగా ఫ్యామిలీ హీరోతో కలిసి పని చేయడం ఇదేమి తొలిసారి కాదు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'కొమరం పులి' సినిమాకు రెహమాన్ సంగీతం అందించారు.