Bollwood movies on Social message: 'సమాజ చైతన్యం దిశగా చిత్రాలు తీసి మెప్పించడం చాలా కష్టం.' - ఇది గతంలో దర్శక, నిర్మాతల అభిప్రాయం. బాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. సామాజిక అంశాలపై చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఇప్పటికే విడుదలైనవి కొన్ని ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కె.జి.ఎఫ్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దక్షిణాది పరిశ్రమలు ముందుకెళ్తుంటే బాలీవుడ్ సామాజిక అంశాలనే అస్త్రంగా చేసుకొంటోంది. సమాజంలోని రుగ్మతలను ప్రశ్నిస్తూ, యువతరం కొత్త పోకడలను చెబుతూ, మానవ సంబంధాలను కొత్తగా చూపించే చిత్రాలను మలయాళ పరిశ్రమ ఎప్పటి నుంచే అందిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ ఈ బాటలో కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. వ్యంగ్య ధోరణిలో నవ్విస్తూ, సున్నిత అంశాలను చెబుతోంది.
చదువు విలువ చెప్పే 'దస్వీ'..విద్య గురించి ఇప్పటికే పలు భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ భిన్నమైనది ‘దస్వీ’. తుషార్ జలోటా తెరకెక్కించారు. ఇందులో అభిషేక్ బచ్చన్ గంగారామ్ చౌధరి పాత్రలో చదువురాని ముఖ్యమంత్రిగా నటించాడు. ఓ కేసులో శిక్ష పడటంతో గంగారామ్ జైలుకెళ్లాల్సి వస్తుంది. జైలులో ఉండే కఠినమైన పనులను తప్పించుకోవడానికి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతాడు గంగారామ్. తర్వాత తాను కేసులో ఇరుక్కోవడానికి తన నిరక్షరాస్యతే కారణమని తెలుసుకున్న గంగారామ్ మనసుపెట్టి చదువుతాడు. మరి తను ఆ పరీక్ష పాసయ్యాడా? చదువు విలువ తెలుసుకున్న తర్వాత తన పంథా మార్చుకున్నాడా? అనేదే మిగిలిన కథ. అక్కడ జైలర్‌గా ఉన్న యామీ గౌతమ్‌కు అభిషేక్‌బచ్చన్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు హాస్యాన్ని పండిస్తాయి. చదువు గొప్పతనాన్ని, ప్రస్తుత రాజకీయాల్లోని డొల్లతనాన్ని చూపిస్తూ వినోదాత్మకంగా రూపొందిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దేశంలో ఎక్కువ మంది ఆదరణ పొందుతోంది.
యువత ఆశలపై 'ఎస్కేప్'.. '6 జీవితాలు, రూ.3 కోట్లు, 1 పోటీ... మీ కలల కోసం మీరు ఎంత దూరం వెళ్లగలరు?’ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే 'ఎస్కేప్ లైవ్' వెబ్‌సిరీస్ ఇతివృత్తం. తక్కువ సమయంలో పేరు, డబ్బు సంపాదించేయాలని సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తున్న యువత ఆలోచనలే ఇతివృత్తంగా తెరకెక్కింది. ఓటీటీలో తొలిసారి ఇలాంటి కథతో వస్తున్న సిరీస్ ఇదే. సిద్ధార్థ్ కుమార్ తివారీ దర్శకుడు. మే 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ హీరో సిద్ధార్‌తో పాటు సుమేధ్ ముద్గల్కర్, జావేద్ జఫారి, శ్వేత త్రిపాఠి తదితరులు నటించారు. ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మేము పెట్టే పోటీలో మీరు విజయం సాధిస్తే రూ.3 కోట్ల నజరానా అందిస్తామని వీడియో స్ట్రీమింగ్ యాప్ ‘ఎస్కేప్ లైవ్’ ప్రకటన ఇస్తుంది. అదే యాప్‌లో పనిచేస్తున్న సిద్ధార్థ్ తన సంస్థ ఆలోచనలకు తన వ్యక్తిత్వానికి మధ్య నలిగిపోయే ఉద్యోగిగా నటించాడు.