Anni Manchi Sakunamule 2023 : కుటుంబ కథా చిత్రాలు తీస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకురాలు నందిని రెడ్డి. 'అలా మొదలైంది'తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. 'కళ్యాణ వైభోగమే', 'ఓ బేబీ' చిత్రాల తర్వాత ఆమె డైరెక్షన్ చేసిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాను.. ప్రియాంక దత్ నిర్మించారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల మందుకు రానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. "దర్శకురాలిగా నా దృష్టిలో సక్సెస్ అంటే కథను కోరుకున్నట్లు చెప్పే స్వేచ్ఛ ఉండటమే'' అని చెప్పారు నందిని రెడ్డి. ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారిలా..
'నా సినీ కెరీర్లో కథకు తగ్గట్లుగా ట్రావెల్ చేసి తీసిన సినిమా ఇది. ఎలాంటి లెక్కలు లేకుండా కథకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాం. మొదటి నుంచి చివరి సన్నివేశాల వరకు నిజాయితీగా ఉండాలనుకున్నా. సినిమా చివరి 20 నిమిషాలు నా కెరీర్‌లోనే అత్యుత్తమం. రిలీజ్ తర్వాత ప్రేక్షకులు కూడా అదే చెబుతారు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు.. అంతా మన మంచికే అని భావించి ముందుకు సాగుతాం. ఆ అర్థంలో పెట్టిన పేరే 'అన్నీ మంచి శకునములే'. ఇది ఒక కల్పిత కథ. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో విక్టోరియాపురం అనే ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించి, ఆ నేపథ్యంలో చిత్రీకరించాం. విక్టోరియాపురం కాఫీ తోటలకు ప్రసిద్ధి. కబీర్ ఖాన్ అనే తెలుగు వంటవాడి వల్ల.. బ్రిటీష్ రాణి విక్టోరియా అక్కడ కాఫీ తాగేది. అందుకే ఆ ఊరికి విక్టోరియాపురం అని పేరు. కాఫీ ఎస్టేట్ యజమానులైన రెండు కుటుంబాల మధ్య జరిగే గొడవలు, ప్రేమ కథాంశంతో సినిమా సాగుతుంది.
'ఈ కథలో నాయకానాయికలతో పాటు ఏడు కీలక పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలను సరిగ్గా పరిచయం చేయడం.. వాటిని కథకు కనెక్ట్ చేయడం ఈ సినిమాలో నాకు పెద్ద ఛాలెంజ్. 'హమ్ అప్కే హై కౌన్' సినిమా చూసిన తర్వాత యాభై మందితో పెళ్లి ఆల్బమ్లా ఉందని.. చిన్న కుక్కపిల్లతో సహా ప్రతి పాత్ర గురించి మాట్లాడుకున్నాం. పాత్రలను తీర్చిదిద్దేందుకు ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు. అందుకు తగ్గట్టుగానే ఈ స్క్రిప్ట్ రాసుకున్నాం. రావు రమేష్, నరేష్ మరియు ఇతర నటీనటులు కలిసి చాలా సినిమాలు చేశారు. మరో సినిమా కోసం కలిశారని కాకుండా అన్ని పాత్రలు కుటుంబ సమేతంగా కనిపించాలని కొత్తదనం కోరుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమా కోసం వాసుకి, అంజు తదితరులను తీసుకున్నాం.'