తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వేసవి అంతా ఈ కుర్ర హీరోలదే జోరు... బాక్సాఫీస్​ మోత మోగిస్తారా?

వేసవి వస్తుందంటే చాలు.. అగ్ర తారల చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీప్రియులు. పసందైన వినోదాలు పంచిచ్చేదెవరు? రూ.వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ను మోత మోగించేదెవరు? సరికొత్త రికార్డులతో కాలరెగరేసెది ఎవరు? అంటూ ఆరాలు మొదలైపోతాయి. కానీ, ఈ వేసవి సినీ మారథాన్‌ కాస్త భిన్నంగా కనిపించనుంది. అగ్ర హీరోల మెరుపులు అంతగా కనిపించకపోవచ్చు. కొందరు ఇప్పటికీ కొత్త చిత్రాలు పట్టాలెక్కించకపోవడం.. మరికొందరు సెట్స్‌పైకి వెళ్లినా దసరా, సంక్రాంతి సీజన్ల వైపు చూడటం దీనికి కారణం. దీంతో ఈ మండు వేసవిలో ప్రేక్షకుల్ని వినోదాల జల్లుల్లో తడిపేందుకు యువ హీరోలు సిద్ధమవుతున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలతో మురిపించేందుకు సెట్స్‌పై చకచకా ముస్తాబవుతున్నారు.

Tollywood Upcoming Movies To Be Released In Summer
Tollywood Upcoming Movies To Be Released In Summer

By

Published : Feb 7, 2023, 6:40 AM IST

సంక్రాంతి ముగిసిందంటే అగ్ర కథానాయకుల సందడి తగ్గుముఖం పడుతుంది. ఫిబ్రవరి, మార్చి పరీక్షా కాలం కావడంతో ఆ రెండు నెలలు చిన్న చిత్రాలకు దారిచ్చేసి.. వేసవి బరిలో తలపడేందుకు సిద్ధమవుతారు. కానీ, కొవిడ్‌ దెబ్బకు కొన్నాళ్లుగా ఈ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఆ సీజన్‌.. ఈ సీజన్‌ అని లెక్కలేసుకోకుండా మంచి తేదీ దొరకడమే ఆలస్యం బాక్సాఫీస్‌ బరిలో దూకేందుకు సిద్ధమవుతున్నారు అగ్ర హీరోలు. దీంతో రెండేళ్లుగా వేసవి సీజన్‌ కూడా కాస్త ముందుకు జరిగినట్లయింది. గతేడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచే వేసవి వినోదాల కాక మొదలైంది.

'భీమ్లానాయక్‌'తో పవన్‌ కల్యాణ్‌ వేసవి సినీ మారథాన్‌కు రిబ్బన్‌ కట్‌ చేస్తే.. ప్రభాస్‌, సూర్య, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, విజయ్‌, చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, కమల్‌హాసన్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి వినోదాల విందు వడ్డించి సినీప్రియుల్ని మురిపించారు. కానీ, ఈ వేసవికి ఈస్థాయిలో అగ్ర తారల మెరుపులు కనిపించే అవకాశాలు లేవు. చిరంజీవి, రవితేజ లాంటి ఒకరిద్దరు అగ్ర హీరోలే ఈ వేసవిలో సినీప్రియుల్ని పలకరించనున్నారు. ఇక మిగిలిన సీజన్‌ మొత్తం కుర్రహీరోల సందడే గట్టిగా కనిపించనుంది. నిజానికి వేసవి సీజన్‌ షురూ కావడానికి మరో నెల సమయమే ఉన్నా.. ఇంత వరకు సినీ క్యాలెండర్‌లో బెర్తులేవీ పూర్తిగా ఖరారు కాలేదు.

నాని, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌, అఖిల్‌ లాంటి కొంతమంది హీరోలే విడుదల తేదీలు ప్రకటించారు. అయితే మరికొందరు విడుదల తేదీ ప్రకటించకున్నా.. వేసవి బరిలో నిలవడం పక్కా అని స్పష్టత ఇచ్చేశారు. అందుకే ఇప్పటికే సమ్మర్‌ సీజన్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చిలో పలువురు కుర్ర హీరోలు, మీడియం రేంజ్‌ కథానాయకులు బాక్సాఫీస్‌ బరిలో అదృష్టం పరీక్షించుకోనున్నారు. యువ హీరో కార్తికేయ 'బెదురులంక'తో మార్చిలో ప్రేక్షకుల్ని పలకరించనున్నట్లు ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు. కానీ, ఇంత వరకు విడుదల తేదీ తేల్చలేదు. ఇది మార్చి తొలి వారాన్ని లక్ష్యం చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 17న 'దాస్‌ కా దమ్కీ'తో పాన్‌ ఇండియా స్థాయిలో సందడి చేయాలనుకున్నారు విష్వక్‌ సేన్‌. కానీ, ఇప్పుడిది మార్చి రెండో వారాన్ని లక్ష్యం చేసుకున్నట్లు సమాచారం. నాగశౌర్య 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్‌' విడుదలపై ఇంత వరకు స్పష్టత రాలేదు. వీటిలో ఒకటి మార్చి, మరొకటి ఏప్రిల్‌లోనూ రానున్నట్లు తెలిసింది. మార్చి 30న నాని 'దసరా'తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుండటం విశేషం. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని మాస్‌ లుక్‌లో కనువిందు చేయనున్నారు.

సిద్ధూ,విష్వక్​,వైష్ణవ్​,అఖిల్

ఏప్రిల్‌కు 'రావణాసుర'తో స్వాగతం పలకనున్నారు రవితేజ. సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఆ మరుసటి వారం 14న 'ఉగ్రం'తో సందడి చేయనున్నారు అల్లరి నరేష్‌. 'నాంది' లాంటి హిట్‌ తర్వాత నరేష్‌ - విజయ్‌ కనకమేడల కలయిక నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో 'విరూపాక్ష' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిస్టీక్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 21న బాక్సాఫీస్‌ ముందుకు రానుంది.

వైష్ణవ్‌ తేజ్‌ - శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రాన్ని వేసవికి తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కానీ, విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఇది ఏప్రిల్‌ నెలాఖరున లేదంటే మేలో థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అఖిల్‌ - సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతోన్న స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఏజెంట్‌'.. పాన్‌ ఇండియా స్థాయిలో ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. అదే నెలలో పవన్‌ కల్యాణ్‌ 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం చిత్రీకరణ ఇంకా మిగిలిన ఉన్న నేపథ్యంలో అనుకున్న సమయానికి రావడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.

చిరంజీవి 'భోళా శంకర్‌', గోపీచంద్‌ 'రామబాణం', నిఖిల్‌ 'స్పై' మే నెలను లక్ష్యం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, విడుదల తేదీపై ఇంత వరకు స్పష్టత రాలేదు. ఇక నాగచైతన్య 'కస్టడీ', తేజ సజ్జా 'హను-మాన్‌' మే 12న బాక్సాఫీస్‌ బరిలో తలపడటం ఇప్పటికే ఖాయమైంది. వీటిలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన 'హను-మాన్‌' పాన్‌ వరల్డ్‌ మూవీగా భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ విడుదల కానుండటం విశేషం. వీరితో పాటు రామ్‌ పోతినేని, వరుణ్‌ తేజ్‌, నితిన్‌, నవీన్‌ పొలిశెట్టి, శ్రీవిష్ణు, సత్యదేవ్‌, ఆనంద్‌ దేవరకొండ తదితరులకు సంబంధించిన పలు సినిమాలు కూడా సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. మరి వీటిలో ఇంకేవైనా వేసవి బరిలో నిలుస్తాయేమో చూడాలి.

నిఖిల్​ సిద్ధార్ధ

ABOUT THE AUTHOR

...view details