Salman Khan Statement: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ హత్యా బెదిరింపుల వ్యవహారంపై ముంబయి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ మేరకు సల్మాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు మంగళవారం ఓ అధికారి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ఆయన స్టేట్మెంట్ను తీసుకున్నట్లు వెల్లడించారు.
అయితే తనకు ఎలాంటి బెదిరింపులు కానీ, బెదిరింపు ఫోన్‌కాల్స్ కానీ రాలేదని ఈ స్టేట్మెంట్లో సల్మాన్ స్పష్టంచేశారు. ఇటీవలి కాలంలో తనకు ఎవరితోనూ గొడవలు కూడా లేవని పేర్కొన్నారు. అంతకుముందు సలీమ్ ఖాన్ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు పోలీసులు. బాంద్రాలో సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదీ జరిగింది:ఆదివారం ఉదయం సలీమ్ ఖాన్.. స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్‌కు వెళ్లారు. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆర్ఎఫ్సీలోనూ పటిష్ఠ భద్రత:ఇక తన తదుపరి చిత్రం 'కభీ ఈద్ కభీ దివాలీ' కోసం సల్మాన్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకోగా.. అక్కడ కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దాదాపు నెల రోజులు సల్మాన్ ఇక్కడే ఉంటారని తెలుస్తోంది.