అగ్ర కథానాయకుడు అనగానే ఇమేజ్, రికార్డులు, మార్కెట్టు, అంచనాలు... ఇలా బోలెడన్ని లెక్కలు. ఆ లెక్కల నుంచే కథలు పుడుతుంటాయి. కానీ యువ కథానాయకులకి ఆ బంధనాలేవీ ఉండవు. ఓ కొత్త రకమైన కథని స్వీకరించాలన్నా... తెరపై ఓ కొత్త రకమైన పాత్రలో కనిపించాలన్నా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రేక్షకులకి కొత్త అనుభవాన్ని పంచే సినిమాల్ని ఇవ్వడంలో ముందు వరసలో ఉంటూ అప్పుడప్పుడూ అద్భుతాల్ని సృష్టిస్తుంటారు. పొరుగు పరిశ్రమల్లోనూ స్ఫూర్తిని నింపుతున్న మన కథానాయకులు ఈసారీ కొత్తగా అడుగులు వేయడానికే ప్రయత్నం చేశారు.
కల్యాణ్‌రామ్, నాని, రానా, శర్వానంద్... కథల ఎంపికలో ఈ కథానాయకుల అభిరుచులే వేరు. అప్పుడప్పుడూ ఎదురు దెబ్బలు తగిలినా సరే... వెనకడుగు వేయకుండా ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథని ఎంచుకుంటుంటారు. అందుకే వీళ్ల సినిమా అంటే ఓ మంచి కథ ఉంటుందనే భరోసా ప్రేక్షకులది. ఆ అంచనాల్ని అటు కథానాయకుడిగానూ, ఇటు నిర్మాతగానూ నిజం చేస్తున్నారు నాని. గతేడాది 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన నాని... ఈసారి 'అంటే... సుందరానికి!' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరోసారి రొమాంటిక్ కామెడీ కథతో చేసిన ఈ సినిమాతో ఆయనకి విజయం దక్కలేదు కానీ, తన శైలి వినోదాన్ని పంచారు. నిర్మాతగా చేసిన 'హిట్ 2' సినిమాతో మాత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కొత్త ప్రయత్నాలు చేయడంలో ఏమాత్రం రాజీపడని కల్యాణ్‌రామ్ ఈసారి పాంటసీ కథతో రూపొందిన 'బింబిసార'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
రెండు కోణాల్లో సాగే పాత్రలో ఆయన నటన, సొంత నిర్మాణ సంస్థలో ఆయన చేసిన ఈ ప్రయత్నంపై అభినందనలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది 'అమిగోస్', 'డెవిల్' చిత్రాలతో సందడి చేయనున్నారు. మరో కథానాయకుడు రానా దగ్గుబాటి ఈ ఏడాది కూడా తనదైన ప్రభావం చూపించారు. 'భీమ్లానాయక్'తో డేనియల్ శేఖర్‌గా ఆయన చేసిన సందడి ఆకట్టుకుంది. 'విరాటపర్వం'తో మరోసారి తన అభిరుచిని చాటి చెప్పారు. అందులో రవన్నగా ఆయన నటన గుర్తుండిపోతుంది. శర్వానంద్‌కి ఈసారి మిశ్రమ ఫలితాలు లభించినా, కథల ఎంపికలో ఆయన ప్రత్యేకతని మరోసారి చాటి చెప్పారు. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' స్వచ్ఛమైన కుటుంబ వినోదం అందించినా ఫలితం మాత్రం పెద్దగా రాలేదు. టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే 'ఒకే ఒక జీవితం' మాత్రం ఆయనకి గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. కథల ఎంపికలో విజయ్ దేవరకొండ కూడా ప్రత్యేకమే. 'లైగర్'తో ఈసారి పాన్ ఇండియా మార్కెట్‌పై గురిపెట్టారు. ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఆయన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షించారు. కానీ సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు.