'పుష్ప' సినిమాతో దర్శకుడు సుకుమార్, 'ది కశ్మీర్ ఫైల్స్'తో వివేక్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో ఎంతటి హిట్ అందుకున్నారో తెలిసిన విషయమే. అలాంటిది వీరిద్దరి కాంబోలో ఓ చిత్రం వస్తే.. ఊహే చాలా బాగుంది కదూ. ఇప్పుడా ఊహే నిజమవ్వబోతుంది. ఈ విషయాన్ని వీరిద్దరే స్వయంగా తెలుపుతూ సినీ ప్రేక్షకులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
'సినిమాతో అంతా ఒక్కటికాబోతున్నాం. వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మీరు ఏమైనా గెస్ చేస్తారా?' అంటూ వివేక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దర్శకుడు సుకుమార్, 'ది కశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' చిత్రాల నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. దాంతో, 'ఈ ముగ్గురు ఎలాంటి సంచలనం సృష్టిస్తారో' అనే ఆసక్తి సినీ ప్రియుల్లో రేకెత్తుతోంది. కానీ.. వీరిలో ఎవరు దర్శకుడిగా పనిచేస్తారు? ఎవరెవరు నిర్మాతలుగా వ్యవహరిస్తారు? అన్న దానిపై స్పష్టత లేదు. మరి, ఈ క్రేజీ కాంబోలో నటించే హీరోహీరోయిన్లు ఎవరు? దానికి డైరెక్టర్ ఎవరు? నిర్మాత ఎవరు? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.