SPB Death Anniversary : ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేశారు. అయితే ఆ తర్వాత ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది బాలునే అని చెప్పాలి. ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఈ బాల గోపాలం.. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా.. ఆ తర్వాత గాయకుడిగా అజరామరమైన పాటలను ఎన్నో ఆలపించి సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. కేవలం గాయకుడిగానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా.. ఇలా బాలు కెరీర్లో ఎన్నో పాత్రలను పోషించారు. అందుకే ఆయన్ను బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటుంటారు.
SPB As Dubbing Artist : యాదృచ్ఛికంగా జరిగినదే... గాయకుడిగా తీరిక లేకుండా ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కెరీర్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా రాణించారు. అయితే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కావడం యాదృచ్ఛికంగా జరిగినదే. కె. బాలచందర్ డైరెక్షన్లో మన్మథలీల అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి తెలుగులో కమల్ హాసన్‌కు ఎస్పీబీ గొంతు అరువు అచ్చారు. దీంతోనే ఆయన డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్, విష్ణువర్థన్, బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్, కె. భాగ్యరాజా, అనిల్ కపూర్, మోహన్, గిరీశ్ కర్నాడ్, అర్జున్, జెమినీ గణేశన్, కార్తీక్, నాగేశ్, రఘువరన్‌కు ఎస్పీబీ డబ్బింగ్ చెప్పారు.