ఎన్టీఆర్.. ప్రేక్షకులకు వెండితెర ఇలవేల్పు. థియేటర్లలో తెరపై కనిపిస్తే జనం హారతులు పట్టేవారు. చేతులెత్తి మొక్కేవారు. ఇళ్లలో దేవుడి గదిలో ఆయన ఫొటోలు పెట్టుకునేవారు. ఆయన పట్ల భక్తిభావంతో ఉండే ప్రేక్షకులు.. ఒక సినిమా నుంచి మాత్రం ఎన్టీఆర్‌ను మరో కోణంలో చూశారు. ఆ సినిమానే 'అడవిరాముడు'. అప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు డ్యాన్స్‌లతో అదరగొట్టేవారు. ఆయన డ్యాన్సులకు ఫిదా అయిపోయేవారు ప్రేక్షకులు. అయితే ఎన్టీఆర్ మాత్రం అప్పటి వరకు ఎందుకో స్టెప్పుల జోలికే పోలేదు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మెస్మరైజ్ చేసేవారు.
అయితే అడవిరాముడు సినిమాలో మాత్రం ఎన్టీఆర్‌ను కొత్తగా చూపించారు దర్శకుడు రాఘవేంద్రరావు. అందులో ఎన్టీఆర్‌కు అదిరిపోయే డ్యూయెట్లను పెట్టారు. ఆ పాటలకు ప్రేక్షకులు ఊగిపోయారు. అప్పటివరకు ఎన్టీఆర్ తెరపై కనిపిస్తే.. హారతులు ఇచ్చి.. పూల చల్లే ప్రేక్షకులు.. డబ్బులు చల్లారు. థియేటర్లను మోతెక్కించారు.
ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. ఇందులోని సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్-బాలు కాంబినేషన్లో వచ్చిన పాటలు వేరే లెవల్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ పాటలకు బాలు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చి పాడేవారు. మాస్ బీట్ ఉన్న పదాలను మధ్య మధ్యలో బాలు సొంతంగా జత చేసేవారట.