The Ghost Movie : "యాక్షన్ పాత్రలు చేయాలన్నది నా కల. అది 'ది ఘోస్ట్'తో నెరవేరింది. ఈ సినిమా చూశాక.. నేను గ్లామరస్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన పాత్రలూ పోషించగలనే నమ్మకం అందరికీ కలుగుతుందని భావిస్తున్నా" అంది నటి సోనాల్ చౌహాన్. ఇటీవలే 'ఎఫ్3'తో నవ్వులు పంచిన ఈ అమ్మడు.. ఇప్పుడు 'ది ఘోస్ట్'తో థ్రిల్ చేసేందుకు సిద్ధమైంది. నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది సోనాల్.
"నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ తెలుగు చిత్రసీమకే. ఈ పరిశ్రమపై నాకెంతో ప్రేమ ఉంది. తెలుగుకు నేనేమీ దూరం కాలేదు. కొవిడ్ పరిస్థితుల వల్లే విడుదల కావాల్సిన చిత్రాలు ఆలస్యమయ్యాయి. ఇకపై వరుస సినిమాలతో సందడి చేస్తా".
తుపాకులతో ఆడిషన్..
"యాక్షన్ పాత్రలు చేయాలన్నది నా కోరిక. ఈ తరహా పాత్రల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. అందుకే దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ కథ వినిపించగానే నాకు చాలా సంతోషమనిపించింది. దీనికి తోడు నాగార్జున వంటి స్టార్‌తో తెర పంచుకునే అవకాశం కావడంతో నా ఆనందం రెట్టింపయ్యింది. అందుకే ఈ కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా వదులుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా".
"స్క్రిప్ట్ వినిపించాక ప్రవీణ్ సర్ ఆడిషన్ కోసం నన్ను తన ఆఫీస్‌కు పిలిపించారు. లోపలికి వెళ్లి చూస్తే.. ఆయన ఎదురుగా ఉన్న టెబుల్‌పై బోలెడన్ని తుపాకులున్నాయి. దేని గురించి ఈ మీటింగ్ అనుకున్నా. తర్వాత ఆ గన్స్ పట్టుకొని స్టిల్స్ ఇవ్వమంటే.. చూపించాను. ఆయన రెండు నిమిషాలు చూసి.. ఓకే అనేశారు. నేనెప్పటికీ మర్చిపోలేని ఆడిషన్ ఇది. ఈ చిత్రంతో నాగార్జునతో కలిసి పనిచేయాలన్న కోరిక కూడా నెరవేరింది. మళ్లీ అవకాశమొస్తే ఆయనతో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది".
మనసు అంగీకరించలేదు
"యాక్షన్ ప్రధానంగా సాగే థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో నేను ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తా. శారీరకంగా ఎంతో సవాల్‌తో కూడుకున్న పాత్రిది. కానీ, నటిగా నాకెంతో సంతృప్తినిచ్చింది. ఈ పాత్ర కోసం నేను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో, గన్స్ ఉపయోగించడంలో రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. అయితే నా శిక్షణ మొదలైన రెండో రోజే నా కాలు వేలు విరిగింది. మొదట నేనిది చిన్న గాయమే అనుకున్నా. ఎక్స్‌రే తీయిస్తే.. వేలు విరిగిందని చెప్పారు. డాక్టర్ కచ్చితంగా ఆరు వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలన్నారు. కానీ, నా మనసు అంగీకరించలేదు. నేనెంతో ఎదురు చూసిన యాక్షన్ పాత్రిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం చేజార్చుకోకూడదనిపించింది. అందుకే నొప్పిని భరిస్తూనే శిక్షణ కొనసాగించి పాత్ర కోసం సిద్ధమయ్యా".