తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Sammathame: 'ఆ విషయంలో అస్సలు రాజీపడలేదు' - కిరణ్​ అబ్బవరం సమ్మతమే రిలీజ్ డేట్​

Kiran Abbavaram Sammathame: "ఈతరం హీరోలు ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అంత మంచిది.  ఎక్కువ నిర్మాణాలు జరిగితే.. ఇండస్ట్రీలో అందరికీ పని దొరుకుతుంది.  ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది" అన్నారు కిరణ్‌ అబ్బవరం. 'సమ్మతమే'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గోపీనాథ్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. చాందిని చౌదరి కథానాయిక. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు కిరణ్‌. అవేంటో తెలుసుకుందాం..

sammatame
సమ్మతమే

By

Published : Jun 21, 2022, 7:47 AM IST

Updated : Jun 21, 2022, 11:05 AM IST

కిరణ్‌ అబ్బవరం

Kiran Abbavaram Sammathame: యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'సమ్మతమే'. చాందిని చౌదరి కథానాయిక. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలిపారు కిరణ్​. ఆయన మాటల్లోనే..

"కెరీర్​ చాలా సంతోషంగా సాగుతోంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కష్టం ఉంటుందని తెలిసినా.. హీరో అవ్వాలని ఇక్కడికి వచ్చా. దాని కోసం ఎంత కష్టపడినా తప్పులేదు. నాలుగేళ్లు కిందా మీదా పడుతూ ఇక్కడికి వచ్చా. ప్రేక్షకులు నా సినిమా చూడటం ఆనందంగా ఉంది. కొన్ని సందర్భాల్లో నాపై విమర్శలు విన్నప్పుడు కాస్త బాధేస్తుంది. ఏమీ జరిగిందో తెలీకుండా మాట్లాడతారు. ఇక కథల ఎంపిక విషయానికొస్తే.. నేను ఎలాంటి సినిమాలు అయితే చూస్తానో.. దాని ఆధారంగా కథలను ఎంచుకుంటా."

"నాదీ.. దర్శకుడు గోపీనాథ్‌ది నాలుగేళ్ల ప్రయాణం. షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే రోజుల నుంచీ కలిసి తిరిగే వాళ్లం. సినిమా పట్ల ఇద్దరికీ ఒకే అవగాహన, ప్యాషన్‌ ఉండేది. అయితే గోపీ స్క్రిప్ట్‌ సిద్ధం చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు. అంతా పకడ్బందీగా సిద్ధమయ్యాకే రంగంలోకి దిగుతాడు. అలా తను ఈ ‘సమ్మతమే’ స్క్రిప్ట్‌ సిద్ధం చేసేసరికి.. నేను రెండు సినిమాలు చేశా. తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించా".
"ఈ చిత్రంలో నేను కృష్ణ అనే కుర్రాడిగా కనిపిస్తా. ఓ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి.. సిటీ అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది ఇందులో వినోదాత్మకంగా చూపించాం. కథ, కథనాలు కొత్తగా, కుటుంబమంతా మెచ్చేలా ఉంటాయి. 75 లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా సినిమా నిర్మించాం. తెరపై చూస్తున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది".
"ఈ చిత్రంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటికి శేఖర్‌చంద్ర అద్భుతమైన స్వరాలందించారు. ప్రతీదీ కథతో ముడిపడి ఉన్న పాటే తప్ప ఎక్కడా ఇరికించినట్లు ఉండదు. ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్‌ చేయాలన్న ఉద్దేశంతోనే ఇందులోని నాలుగు పాటల్ని ఇంకా విడుదల చేయలేదు. ఇవన్నీ వాళ్లను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. నేను ఏ చిత్రం చేసినా.. ప్రేక్షకులు కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగేలా ఉండాలనుకుంటా. అందుకే సినిమాలో ఎలాంటి అసభ్యతకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటా.మొత్తంగా ప్రతిఒక్కరూ థియేటర్లలో సినిమా చూసి వాటిని కాపాడాలి. అక్కడ చూడటం వల్ల పొందే అనుభూతి ఇంట్లో రాదు" అని అన్నారు.

"నా తొలి రెండు సినిమాల విషయంలో ప్రతీదీ దగ్గరుండి చూసుకున్నా. కానీ, ‘సెబాస్టియన్‌’కి అలా కుదర్లేదు. అదే సమయంలో మా అన్నయ్య చనిపోవడం, ఆర్థిక సమస్యలు ఎదురవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల ఆ చిత్రానికి నేను సరైన సమయం కేటాయించలేకపోయా. వీటన్నింటికీ తోడు ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా సరైంది కాదు. ఓవైపు ‘భీమ్లా నాయక్‌’, ‘రాధేశ్యామ్‌’ వంటి పెద్ద చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకొస్తున్న తరుణంలో.. మా సినిమా ఎవరికీ కనిపించదని తెలుసు. కానీ, దాన్ని విడుదల చేయకుండా అలా ఉంచేస్తే అందరూ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో.. సరైన తేదీ కాకున్నా ప్రేక్షకుల ముందుకొచ్చాం. దాని వల్లే మేము ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం"
"ఈ ఏడాది నా నుంచి మరో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. ఆగస్ట్‌లో 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' విడుదలవుతుంది. సెప్టెంబర్‌ నెలాఖరులో 'వినరో భాగ్యము విష్ణుకథ' రిలీజవుతుంది. ఈ రెండు సినిమాలు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అలాగే మైత్రీ మూవీస్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ చిత్రం చేస్తున్నా. అదీ ఈ ఏడాదే విడుదలవుతుంది" అని అన్నారు.

ఇదీ చూడండి:Chaor Bazaar: 'లెక్కలు వేసుకోను.. అవసరమైతే ఆ పనైనా చేస్తా'

Last Updated : Jun 21, 2022, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details