Telugu cinema updates: చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి సమంత. ప్రస్తుతం ఆమె నటించిన 'శాకుంతలం' నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. 'యశోద', 'ఖుషి' చిత్రాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. మరోవైపు హిందీలో తెరంగేట్రం చేసేందుకు కొన్ని కథలు ఓకే చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పుడామె ఖాతాలో ఓ మలయాళ చిత్రం చేరినట్లు తెలుస్తోంది. అదే 'కింగ్ ఆఫ్ కోత'. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. అభిలాష్ జోషి తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా సామ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, సమంత గతంలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' చిత్రంలో నటించారు. కానీ, అందులో ఇద్దరికీ కాంబినేషన్ సీన్లు లేవు.
'జోకర్' మళ్లీ వస్తున్నాడు:జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం 'జోకర్' బాక్సాఫీస్ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.07 బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడమే కాక.. అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఫీనిక్స్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్' తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన టాడ్ ఫిలిప్స్ ఈ సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 2024 అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్ర సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. 'జోకర్'కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సీక్వెల్‌లో హార్లే అనే కీలక పాత్రలో లేడీ గాగా సందడి చేయనుంది.
తెరపైకి మంగళ్‌యాన్ విజయగాథ: అంతరిక్ష పరిశోధనల్లో భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మంగళ్‌యాన్ మిషన్. అతి తక్కువ ఖర్చుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఈ మార్స్ మిషన్.. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా లక్ష్యాన్ని సాధించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇప్పుడీ మంగళ్‌యాన్ విజయగాథను 'యానం' పేరుతో తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు వినోద్ మంకర. ప్రపంచ సినిమా చరిత్రలో మొట్ట మొదటి సైన్స్ - సంస్కృత చిత్రమిది. ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ రచించిన 'మై ఒడిస్సీ: మెమోయిర్స్ ఆఫ్ ది మ్యాన్ బిహైండ్ ది మంగళ్‌యాన్ మిషన్' పుస్తకాధారంగా దీన్ని తెరకెక్కించారు.
ఇది ఆగస్టు 21న చెన్నైలో ప్రదర్శితం కానుంది. ఈ చిత్ర ప్రీమియర్‌ను ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. ''ఇస్రోతో పాటు అందులోని శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాలను ప్రపంచం ముందు ప్రదర్శించడమే ఈ డాక్యుమెంటరీ లక్ష్యం. భారతీయ శాస్త్రవేత్తలు అన్ని పరిమితులను అధిగమించి.. సంక్లిష్టమైన మార్స్ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే ఎలా సాధించారో ఇది వివరిస్తుంది. 45 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ పూర్తిగా సంస్కృతంలో ఉంటుంది'' అని దర్శకుడు వినోద్ తెలిపారు.